WGL |గీసుగొండలో కాంగ్రెస్ వర్గ పోరు..
గీసుగొండ, ఫిబ్రవరి 21 (ఆంద్రప్రభ) : మండలంలోని కొమ్మాలలో నిర్వహించేందుకు ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రడం భరత్ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ అవగాహన సదస్సుకు ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో మొదటిసారిగా జరుగుతున్న ఈ సమావేశానికి ఆర్జీపీఆర్ఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు కునాల్ బెనర్జీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఈ క్రమంలో పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విభాగాల్లో ఒకటైన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఉద్దేశం గానీ, గాంధేయవాదం పై అవగాహన లేక వర్గ విభేదాలకు తావిస్తూ తమపై కక్ష సాధింపు చర్యతో సమావేశానికి హాజరైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని, కేసు పెట్టి, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరింపులకు గురి చేశారన్నారు.
పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకోవడంతో అక్కడున్న వారందరూ ఆందోళనకు గురయ్యారు. సమావేశంలో పంచాయతీరాజ్ చట్టం, పంచాయతీలకు అధికారాలు, విధులు, స్వయం పరిపాలన, ప్రజల భాగస్వామ్యం, గాంధేయవాదం గురించి మాత్రమే వివరిస్తారని, ఎందుకు ఆపుతున్నారని ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రడం భరత్ పోలీసులను ప్రశ్నించినప్పటికీ ఇక్కడ సమావేశం నిర్వహించరాదని పోలీసులు ఖరాకండిగా చెప్పటంతో సమావేశాన్ని హనుమకొండలోని కాంగ్రెస్ భవన్ కు మార్చారు. కాగా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రోద్బలంతోనే సమావేశం కొమ్మాలలో జరగకుండా చేశారని ఆర్జీపీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ అనుబంధ కార్యక్రమాలను, స్థానిక నాయకులను అడ్డుకోవడం సరైంది కాదని రడం భరత్ అసహనం వ్యక్తం చేశారు.