హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదని అన్నారు. మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రపంచ పర్యావరణం కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా ఆయన చేసిన త్యాగం అసమాన్యమైనదని కేసీఆర్ అన్నారు.
అడవులు, పచ్చదనం అభివృద్ధి దిశగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన.. తెలంగాణకు హరితహారం ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దర్పల్లి రామయ్య అందించిన సహకారం గొప్పదని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తు తరాలకు మనం అందించే సంపద హరిత సంపదే కావాలని, భౌతిక ఆస్తులు కావని పునరుద్ఘాటించారు.
పచ్చని అడవులను ధ్వంసం చేస్తూ, వన్యప్రాణులకు నిలువనీడ లేకుండా ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న పర్యావరణ వ్యతిరేక ధోరణులను నిలువరించడానికి, వర్తమాన పరిస్థితుల్లో వేలాది వనజీవి రామయ్యల అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. వనజీవి మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేసారు. శోకంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు పర్యావరణ పరిరక్షకులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.