Rare event | పీఎస్ లో ఫిర్యాదుతో..

Rare event | పీఎస్ లో ఫిర్యాదుతో..
Rare event | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పెంపుడు పిల్లి దొంగతనం కేసు చివరికి పోలీస్ స్టేషన్లో విచిత్ర పరిణామాలకు దారితీసింది.
హైదరాబాద్‌లోని లాలాగూడ పరిధిలో ఓ యువతికి చెందిన పెంపుడు పిల్లి దొంగతనం కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగతనం చేసిన వ్యక్తి బండి నంబర్‌ను గుర్తించి ఫిర్యాదు చేసింది. పోలీసులు వాహనం వివరాల ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి, మహిళతో పాటు అతడిని స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా తన పిల్లిని తిరిగి ఇవ్వాలని మహిళ కోరగా, ఆ వ్యక్తి ఆశ్చర్యకరమైన వివరణ ఇచ్చాడు. పిల్లిని తీసుకెళ్లిన తర్వాత అది తన చేయి కొరికి పారిపోయిందని, ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలో తెలియదని చెప్పాడు.
అయితే బాధిత యువతి ఈ విషయాన్ని నమ్మకుండా పిల్లిని తిరిగి ఇవ్వాలని పట్టుబట్టింది. పరిస్థితి తీవ్రతరంగా మారడంతో ఆ వ్యక్తి ఆమె కాళ్లు మొక్కి క్షమాపణలు కోరినట్లు సమాచారం. చివరికి పోలీసులు ఇద్దరినీ సముదాయించి, ఆ వ్యక్తికి హెచ్చరిక జారీ చేసి పంపించారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
