పోలీస్ స్టేషన్ లో తండ్రిపై బుడ్డోడు ఫిర్యాదు
(నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో) : సమాజంలో మానవత్వం చచ్చిపోలేదు. కళ్ల ముందే కన్న తల్లిని తండ్రి హింసిస్తుంటే.. ఏడేళ్ల బుడ్డోడు తట్టుకోలేపోయాడు. పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. తండ్రి కిరాతకంపై ఫిర్యాదు చేశాడు. నంద్యాల జిల్లా (Nandyal District) లో బుధవారం ఈ ఘటప చోటు చేసుకుంది. నంద్యాల టూ టౌన్ పోలీసుల కథనం ప్రకారం, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒక మహిళను రోజు భర్త అనుమానిస్తూ, రోజు నానా రకాలుగా హింసిస్తుంటే ఆ తల్లి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను కాపాడేందుకు స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడికి చేరుకున్న ఆమె భర్త ఆ స్థితిలోనూ ఆమెను హింసించటం సహించలేక ఆ చిన్న పిల్లాడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ (2 Town Police Station) వైపు పరిగెట్టాడు. అక్కడ ఉన్న పోలీసు సిబ్బందికి అసలు విషయం చెప్పాడు. మహిళా ఏ ఎస్ ఐ ఆ బాలుడి వ్యథను విని వెంటనే స్పందించి బాలుడి తండ్రిని కానిస్టేబుల్ ద్వారా పోలీసు స్టేషన్ కు పిలిపించారు. సీఐ అస్రార్ భాష ఎదుట హాజరు పరిచారు. ఆ తాగుబోతు భర్తకు పోలీసులు సీరియస్ గా కౌన్సెలింగ్ ఇచ్చారు..

