యాదాద్రి : జిల్లా కలెక్టర్ హనుమంతు రావు నారాయణపూర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో బస చేశారు. హాస్టల్‌కు చేరుకున్న కలెక్టర్ హనుమంతు రావు… విద్యార్థులతో సంభాషించి పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్ లోని విద్యార్థులను పలకరిస్తూ, ముఖాముఖి విద్యార్థులతో మాట్లడుతూ… వారి రోజువారి దినచర్యను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల వసతులను పరిశీలించారు.
హాస్టల్ వంటగది, స్టోర్ రూమ్, కూరగాయలు, బియ్యం నిల్వ ప్రాంతాలు, గదులు, పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు.. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా విద్యార్థులతో మమేకమై మాట్లాడి, వారి అభ్యసన సామర్ధ్యాలను పరీక్షించి, చక్కగా చదువుకొని ఉన్నత విలువలతో తమ లక్ష్యాలను సాధించాలన్నారు.
విద్యార్థులు సబ్జెక్టుల వారీగా సాధన చేస్తూ.. ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలని, విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలని, మానసిక ఒత్తిడిని దరిచేరనివ్వొద్దని, పది ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్టు అని అన్నారు.
పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు భయాందోళన చెందకుండా పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి 10వ తరగతిలో 10/10 GP సాధించాలని… విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు.
స్టడీ అవర్స్ అనంతరం విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ.. బాగా చదువుకోవాలని, జీవితంలో ఎంచుకున్న మంచి బాటలో ప్రయాణించాలని, పిల్లల కలలు సాకారం కావాలని ఆకాంక్షిస్తూ వారికి గుడ్ నైట్ అని చెప్పి, కలెక్టర్ నిద్రించారు.

