అరటి తోటను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశా

అరటి తోటను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశా

ఏఈఓ సాయిరామ్ ను సస్పెండ్ చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశా

కంచికచర్ల,ఆంధ్ర‌ప్ర‌భ‌ : ఇటీవల అకాల వర్షాలకు నేల వాలిన అరటి తోటను జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ శా శనివారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. రైతుల కష్టాలు పట్టించుకోకుండా విధి నిర్వహణలో అలసత్వం వహించారనే కారణంతో కంచికచర్ల వ్యవసాయ విస్తరణ అధికారి సాయిరామ్ ను సస్పెండ్ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిణి విజయకుమారి ని ఆదేశించారు. కంచికచర్ల రెవెన్యూ పరిధిలో కీసర వద్ద అరటి తోట ఇటీవల రెండు రోజుల క్రితం వీచిన గాలులకు అకాల వర్షానికి వాలి పోయింది. సంబంధిత పొలం యజమాని రామిరెడ్డి సీతయ్య సంబంధిత వ్యవసాయ అధికారులకు సమాచారం అందించారు.

విషయం జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా దృష్టికి వెళ్లడంతో శనివారం సాయంత్రం మైలవరం నియోజకవర్గ పరిధిలో పర్యటన ముగించుకుని వెళుతూ అరటి తోటను పరిశీలించేందుకు కలెక్టర్ కీసర గ్రామం వచ్చారు. ఈ సందర్భంగా తోట యజమాని రామిరెడ్డి కలెక్టర్ తో మాట్లాడుతూ అరటి తోట పడిపోయిన విషయం ఏఈఓ సాయిరాం కి సమాచారం అందించినా స్పందన లేదని, తననే ఫోటోలు తీసి పెట్టమన్నాడని పేర్కొన్నారు. కలెక్టర్ లక్ష్మీశా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బాలాజీ తో ఫోన్లో మాట్లాడారు.

ఒకవైపు వర్షాలు పడుతూ ఉంటే క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించి, తాను కూడా నష్టం జరిగిన ప్రాంతాల సందర్సనకు వెళుతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఈఓ సెలవులో వున్నాడాని తెలపడంతో, అకాల వర్షాలు పడి గాలులు వీచి రైతులు కష్టకాలంలో ఉన్న సమయంలో సెలవులో ఉండటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏ ఈ ఓ సాయి రామ్ ను సస్పెండ్ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ని ఆదేశించారు. సెలవ మంజూరు చేసిన అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

45 రోజుల్లో కోతకు వచ్చే సమయంలో గాలి వానలకు తోట ఒరిగిపోయి పోవటంతో తీవ్రంగా నష్టపోయినట్లు రామిరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అధికారులతో మాట్లాడి నష్టపోయిన పంటను అంచనా వేయించి ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందర్భంగా రైతుకు హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట డిప్యూటీ తాహసిల్దార్ మానస, ఆర్ ఐ వెంకట్ రెడ్డి, సంబంధిత అధికారులు, వీఆర్వోలు పాల్గొన్నారు.

Leave a Reply