సమన్వయంతో మహిళా దినోత్సవం

సమన్వయంతో మహిళా దినోత్సవం
- జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : మార్చి 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లోని ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భీమవరం విష్ణు కాలేజీలో నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమం ఏర్పాట్లపై స్త్రీ, శిశు సంక్షేమం, డి.ఆర్.డి.ఏ, మెప్మా, విద్యాశాఖ, కార్మిక శాఖ తదితర శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలను గుర్తించి సన్మానించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వ్యాపార, విద్య, ఉపాధి, క్రీడా, సేవా రంగాలలో విశేష కృషి చేసిన మహిళలకు వేదికపై గౌరవ సత్కారం నిర్వహించాలని తెలిపారు.
అలాగే వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలకు అందిన ఆర్థిక సహాయం ద్వారా వారు సాధించిన ప్రగతికి సంబంధించిన వివరాలను సేకరించి కార్యక్రమంలో ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. మహిళలు స్వయం ఉపాధి యూనిట్ల ద్వారా తయారు చేస్తున్న ఉత్పత్తులను కార్యక్రమం ప్రాంగణంలో స్టాళ్ల రూపంలో ఏర్పాటు చేసి ప్రదర్శించాలని ఆదేశించారు. కార్యక్రమాన్ని ఆకర్షణీయంగా నిర్వహించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
సమావేశం ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే మహిళలకు త్రాగునీరు, అల్పాహారం, పారిశుధ్య నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమకూర్చాలని సంబంధిత శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి డి.శ్రీలక్ష్మి, డి.ఆర్.డి.ఏ పీడీ ఎం.ఎస్.ఎస్.వేణుగోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.నారాయణ, ఎల్.డి.ఎం నాగేంద్రప్రసాద్, కార్మిక శాఖ అధికారి ఎ.లక్ష్మీ, సిపిఓ శివ పార్వతి, మెప్మా ఎఓ హెప్సిబా, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
