Collector | సంపూర్ణత అభియాన్ 2.0 అమలు…

Collector | సంపూర్ణత అభియాన్ 2.0 అమలు…

  • మారు మూల గ్రామాలపై ప్రత్యేక దృష్టి…

Collector | తిర్యాణి, ఆంధ్రప్రభ : మండలంలోని ఆస్పిరేషనల్ బ్లాక్ పరిధిలో సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ శ్రీమతి కె. హరిత ఐఏఎస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మారు మూల గ్రామాలు మరియు సిగ్నల్ లేని ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ లేని ఒక్కరిని కూడా మిగల్చకుండా నమోదు పూర్తి చేయాలని, అలాగే నెలవారీ ప్రభుత్వ చెల్లింపులు పొందాలంటే ఆధార్‌తో బ్యాంక్ ఖాతా అనుసంధానం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ తీసుకువచ్చి లింకింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. సంపూర్ణత అభియాన్ 2.0 లక్ష్యాలుగా ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం రంగాల్లో కీలక సూచికలను నిర్దిష్ట కాలవ్యవధిలో సాధించాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందించడం, మరుగుదొడ్లు మరియు తాగునీటి వసతుల కల్పన, పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్ల నిర్మాణం, పశువుల టీకాల కార్యక్రమాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Collector |

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ పాఠశాలల్లోని మరుగుదొడ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు.బాలికలకు అవసరమైన మౌలిక వసతులు సమయానికి అందేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ఐసిడిఎస్ పరిధిలో పిల్లలకు పౌష్టికాహారం (న్యూట్రిషన్) ఏ విధంగా అందిస్తున్నారు అనే విషయంపై వివరాలు అడిగి తెలుసుకొని, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, మండల ప్రత్యేక అధికారి రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో వేముల మల్లేష్ లతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply