Collector | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పనితీరు

Collector | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పనితీరు

  • అర్హత ఉన్న ప్రతి లబ్దిదారుడికి సంక్షేమ పథకాలు
  • 24,603 నూతన రేషన్ కార్డులు
  • సన్న వడ్లకు 137 కోట్ల 81 లక్షల బోనస్
  • సబ్సిడితో 9 లక్షల 21 వేల గ్రాస్ సిలిండర్ లు సరఫరా
  • 34 వేల గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరా
  • పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష

Collector | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పనితీరు ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తో కలిసి పాల్గొని పోలీసు గౌరవం వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ… అర్హులైన నిరుపేద కుటుంబాలకు రేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూతనంగా 24 వేల 603 రేషన్ కార్డులు జారీ చేయడం ద్వారా అదనంగా 86,734 మంది పేదలు రేషన్ ద్వారా సన్నబియ్యం పొందుతున్నారన్నారు. ఖరీఫ్ 2024-25 సీజన్ కు సిఎంఆర్ రైస్ డెలీవరి 100శాతం పూర్తి చేసి పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

వ్యవసాయ రంగం ఆధునీకరించేందుకు ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునః ప్రారంభించి, జిల్లాలో 61 మంది రైతులను ఎంపిక చేసి 23 లక్షల 36 వేల రూపాయల సబ్సీడితో వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశామన్నారు. 46 వేల 507 మంది రైతుల నుండి 3 లక్షల 10 వేల 450 మెట్రిక్ టన్నుల సన్న వడ్లు కొనుగొలు చేసి 137 కోట్ల 81 లక్షల బోనస్ రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు. జిల్లాలో కోటి 68 లక్షల రూపాయల సబ్సీడితో మరో 3180 ఎకరాలలో ఆయిల్ పామ్ పంట విస్తరించినట్లు పేర్కొన్నారు.

Collector

మహాలక్ష్మీ పథకం క్రింద జిల్లాలోని 1,18,781 మంది లబ్దిదారులకు 9,30,027 గ్యాస్ సిలిండర్లను 26 కోట్ల 31 లక్షల సబ్సీడితో 500 రూపాయలకే పంపిణీ చేశామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం ద్వారా 169 కోట్ల 29 లక్షల రూపాయలను ఆదా చేసినట్లు తెలిపారు. జిల్లాలో నిరుపేదలకు 6166 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి లబ్దిదారులకు ప్రతి వారం నిర్మాణ పురొగతి ఆధారంగా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. గృహజ్యోతి పథకం క్రింద జిల్లాలో 200 యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్న 1,34,896 మంది కుటుంబాలకు 111 కోట్ల 55 లక్షల సబ్సీడి భరించి జీరో బిల్ జారీ చేశామన్నారు.

టీజీ రెడ్కో ద్వారా మంథని, నంది మేడారం, శ్రీరాంపూర్, అప్పన్నపేటలో 12 కోట్ల రూపాయల వ్యయంతో 1 మెగా వాట్ సామర్థ్యం చొప్పున విద్యుత్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు ఆర్థిక , వ్యాపార నిర్వహణలో శిక్షణ ఇచ్చుటకు పెద్దపల్లిలోని రంగంపల్లి వద్ద వీ హబ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపి రాంరెడ్డి, అదనపు కలెక్టర్ లు జే.అరుణ శ్రీ, డి.వేణు, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి.ప్రకాష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply