ELECTION |’కోడ్ ‘… కూయనుంది…?

- ఎన్నికల హడావిడిలో అధికారులు..
- గ్రామాల్లో వేడెక్కుతున్న ఎన్నికల వాతావరణం..
- నేడు తేలనున్న వార్డు మెంబర్, సర్పంచ్ ల రిజర్వేషన్లు..
ELECTION | మోత్కూర్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికలకు సైరన్ మ్రోగనుండడంతో ఎన్నికల కోడ్ కూయనుండడంతో.. పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అటు గవర్నర్ బిల్లు పెండింగ్.. ఇటు హైకోర్టులో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో నిరాశ.. ఎట్టకేలకు పాత రిజర్వేషన్లతో (50 శాతం) స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ నెల 25 లేదా 26 న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో గ్రామాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడేక్కింది. ఎన్నికల ఏర్పాట్ల కోసం అధికారుల్లో సైతం హడావిడి మొదలయ్యింది.
డిసెంబర్ నెలలో 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నేడు ఆదివారం సెలవు రోజైనప్పటికీ వార్డ్ మెంబర్ రిజర్వేషన్లు స్థానిక ఎంపీడీఓ కార్యాలయాలలో, సర్పంచ్ రిజర్వేషన్లు ఆర్ డి ఓ (రెవెన్యూ డివిజనల్ అధికారి) కార్యాలయంలో రిజర్వేషన్ల ఖరారు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. మా ఊరు ఈసారి ఏ రిజర్వేషన్ వస్తుందో అని…?
ఆశావాహులు సర్పంచ్ పదవుల పట్ల ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
