CM Revanth Delhi Tour | రెండు రోజుల పాటు అక్క‌డే..

  • ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌లిసే అవ‌కాశం
  • మెట్రో రెండో ద‌శ‌, ఎరువుల కొర‌త‌పై చ‌ర్చ‌
  • స్థానిక ఎన్నిక‌ల‌పై అధిష్టానంతో మంత‌నాలు
  • కొత్త కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మానికి రాహుల్, ప్రియాంకల‌కు ఆహ్వానం

న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ఇవాళ‌ మ‌ధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.. అక్క‌డే రెండు రోజులు ఉండ‌నున్నారు.. ఇది కేవలం అధికారిక టూర్ మాత్రమే కాకుండా, రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలు, కేంద్ర మద్దతు కల్పన, పార్టీ వ్యూహాలపై హైకమాండ్‌తో కీలక చర్చలకు వేదికగా మారనుంది కుంది.

రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటూ సీఎం రేవంత్ కేంద్ర మంత్రులు (Union Ministers), కాంగ్రెస్ అధిష్ఠానం, పార్టీ శ్రేణులతో సమావేశాలు జరపనున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ (Metro Rail Phase 2 Expansion) కు సంబంధించిన డీపీఆర్, రీజనల్ రింగ్ రోడ్ (Regional Ring Road) కు సంబంధించి కేంద్ర స్థాయిలో మద్దతు పొందడమే లక్ష్యంగా చర్చలు జరగనున్నాయి. అలాగే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యూరియా, ఎరువుల కొరత నేపథ్యంలో.. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను ముఖ్యమంత్రి కలవనున్నారు. రాష్ట్రానికి తక్షణ ఎరువుల కోటా విడుదల చేయాలని కోరనున్నారు. రైతుల అవసరాల దృష్ట్యా ఇది అత్యవసరంగా భావిస్తున్నారు.

అలాగే, తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తూ చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జూలై 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను ఆహ్వానించాలన్న యోచనలో రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంకా పార్టీలో కొన్నేళ్లుగా సాగుతున్న అంతర్గత విభేదాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానంతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, గ్రౌండ్ వర్క్ పటిష్టతకు రేవంత్ పలు అంశాలను హైకమాండ్‌కు వివరిస్తారు.

జూలై 12 నుంచి 18 వరకూ ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాల వివరాలు కూడా సీఎం రేవంత్ పార్టీ హైకమాండ్‌ కు తెలియజేయనున్నారు. మహిళల అభివృద్ధికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యాచరణపై సమీక్ష జరుగుతుంది.

Leave a Reply