ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్…

- నేడు కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం
- గ్లోబల్ సమ్మిట్, విజన్ 2047 డాక్యుమెంట్‌పై చర్చ
- స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీపై సమాలోచనలు
- రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, అనుమతులపై కేంద్ర మంత్రులతో భేటీ
- రాష్ట్ర ఎంపీలతో సమావేశమై పార్లమెంట్‌లో ప్రస్తావించే అంశాలపై దిశానిర్దేశం
హైదరాబాద్, ఆంధ్రప్రభ ముఖ్య ప్రతినిధి : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ అగ్రనేతలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అనుమతులు, నిధుల కేటాయింపుకు సంబంధించి కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రెండు రోజుల పాటు ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌ను పూర్తి చేసుకుని బుధవారం సాయంత్రం ఢిల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం పార్టీ అగ్రనేతలు మల్లికార్జునఖర్గే, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు.
గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులను రాబట్టిందని, 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ దిగ్గజాలు రాష్ట్రానికి వచ్చాయని ఆయన పార్టీ పెద్దలకు నివేదించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన మెట్రో విస్తరణ, మూసీ పునర్జీవం, రీజినల్, రేడియల్ రోడ్లు, స్కైవేలు, ఇతర అంశాలకు సంబంధించి పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులను కలవనున్నారు.
ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టుకు నిర్మించ తలపెట్టిన 8లైన్ల జాతీయ రహదారి, హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి నల్లమల అడవుల ద్వారా ఏర్పాటు చేయతల పెట్టిన రహదారుల అనుమతులకు సంబంధించి సీఎం రేవంత్ కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నారు.
నామినేటెడ్ పదవుల భర్తీతోపాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ పెద్దలను కలిసిన సందర్భంలో ఆయన వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన ఈ రెండేళ్లలో అమలు చేసిన హామీలు, వచ్చే మూడేళ్లు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పథకాలు, కార్యాచరణపై పార్టీ పెద్దలతో సమాలోచనలు జరపనున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని చెప్పనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీల ఎన్నికలు, భవిష్యత్‌లో నిర్వహించాలనుకున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కూడా ఈ సందర్భంగా ఆయన చర్చించే అవకాశం ఉంది.
రెండు రోజులపాటు ఢిల్లిలోనే ఉండనున్న సీఎం రేవంత్ ఎంపీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు అనుమతులను, నిధులను వేగవంతంగా ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో సానుకూలంగా వ్యవహరించడం లేదన్న అంశాన్ని రాష్ట్ర ఎంపీలకు వివరించి వాటిని పార్లమెంట్‌లో ప్రస్తావించే విధంగా దిశానిర్దేశం చేయనున్నారు.
