Chityala | జాతీయ రోడ్డు భద్రత… ప్రతి ఒక్కరి బాధ్యత….
- జిల్లా రవాణాశాఖ అధికారి మహమ్మద్ సంధాని.
Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : జాతీయ రోడ్డు భద్రత, ప్రతి ఒక్కరి బాధ్యత అని, భద్రత మాసోత్సవం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని జయశంకర్ జిల్లా రవాణాశాఖ అధికారి మహమ్మద్ సంధాని తెలిపారు. ఈ రోజు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో రహదారి భద్రతా కార్యక్రమం, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, ప్రజలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి మహమ్మద్ సంధాని పిలుపునిచ్చారు. రోడ్డు విస్తరణ పెరిగినప్పటికీ, వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గత 37 సంవత్సరాలుగా “రోడ్ సేఫ్టీ వీక్” నిర్వహించినప్పటికీ ప్రమాదాలు తగ్గకపోవడంతో, భారత ప్రభుత్వం దీనిని జాతీయ రోడ్ భద్రత మాసోత్సవంగా మార్పు చేసి, ప్రతి సంవత్సరం జనవరి నెల మొత్తం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ మాసోత్సవం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్, రవాణా శాఖ ఏఎంవిఐ సుందర్ లాల్, శ్రీనివాస్, లెక్చరర్లు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

