Chityala | కాంగ్రెస్కు గుణపాఠం చెప్పండి

Chityala | కాంగ్రెస్కు గుణపాఠం చెప్పండి
- మోసపూరిత హామీలతో గద్దెనెక్కింది
- మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడించండి
- మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
- చిట్యాలలో పార్టీ వైఫల్యాల బాకీ కార్డులను పంపిణీ
Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డు చంద్రపురి కాలనీలో అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల బాకీ కార్డులను ఈ రోజు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పంపిణీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బాకీ ఉన్న మొత్తాన్ని క్లుప్తంగా వివరిస్తూ ఆయన వార్డులలో తిరిగారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరిస్తూ, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు..

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలతో అమలుకాని హామీలతో గద్దెనెక్కిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం అన్నారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టడానికే చిట్యాల మున్సిపాలిటీలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చిట్యాల మున్సిపాలిటీకి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దాదాపు రూ.30 కోట్లతో పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్, వైకుంఠధామాలు, కుల సంఘ భవనాలు వంటి అనేక పనులకు పూర్తి చేశామన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రెండేళ్లలో ఒక్కనాడు కూడా పట్టణంలో తిరిగిన దాఖలాలు లేవని, పట్టణ సమస్యలపై ఒక్కరోజు కూడా స్పందించలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వస్తేనే హడావుడి చేస్తుందని, ఎన్నికలు లేకపోతే అసలు పట్టించుకునే దిక్కే లేకుండా పోయిందన్నారు. రేవంత్ రెడ్డికి ఆ పార్టీ నాయకులు మూటలు మోయడం.. సంచులు ఇవ్వడం బాగా అలవాటుగా మారిందన్నారు. అదే మాదిరిగా ఎన్నికల సమయంలో మీ వద్ద వస్తారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధిని బేరీజు చేసుకొనే వచ్చే ఎన్నికల్లో ఓటేయాలని పట్టణ ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే చిట్యాల మున్సిపాలిటీ ప్రజలకు లాభం జరుగుతుందన్నారు. ప్రజలు ఆలోచించి ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఆయన వెంట జడల ఆది మల్లయ్య, జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, ఆవుల ఆనంద్, ఆకు అశోక్ తదితరులు ఉన్నారు.


