Chittoru | ఆధునికంగా అన్నదాతలు..
Chittoru, ఆంధ్రప్రభ. ఆధునిక సాంకేతికతను వ్యవసాయంతో అనుసంధానిస్తూ చిత్తూరు జిల్లా రైతులు కొత్త దశలోకి అడుగుపెడుతున్నారు. పంటల మందు పిచికారీ, ఎరువులు చల్లడం, పంటల స్థితిని అంచనా వేయడం వంటి పనుల్లో డ్రోన్ల వినియోగం రోజురోజుకీ విస్తృతమవుతోంది. రైతులు ఎదుర్కొంటున్న కార్మికుల కొరత, అధిక ఖర్చు, సమయాభావం వంటి సమస్యలకు ఇది సరికొత్త పరిష్కారంగా మారుతోంది. చిత్తూరు రైతులు సాంకేతికతను అలవర్చుకుని సమయం, శ్రమ, ఖర్చు ఆదా చేసుకుంటూ ఆధునిక వ్యవసాయానికి కొత్త దిశ చూపిస్తున్నారు. చిత్తూరు (Chittoru) జిల్లాలో ఇప్పటి వరకు డ్రోన్ల వినియోగం లేకపోయినా, ప్రస్తుతం ఇది వేగంగా విస్తరిస్తోంది.
జిల్లాలో పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు లేకపోవడంతో వరి సాగు పరిమితంగానే ఉంది. అయితే.. మామిడి, టమాటా, మొక్కజొన్న వంటి పంటలలో డ్రోన్ వినియోగం పెరుగుతోంది. పుత్తూరు ప్రాంతంలో మామిడి తోటలు, రామచంద్రాపురం మండలంలోని టమాటా పొలాలు, పలమనేరు పరిసర ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న పొలాల్లో రైతులు డ్రోన్లతో మందుల పిచికారీ చేస్తున్నారు. కొన్ని రైతు సహకార సంఘాలు స్వయంగా డ్రోన్లను కొనుగోలు చేసి, సభ్యులకు అద్దె విధానంలో అందుబాటులో ఉంచుతున్నాయి. వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా 80 శాతం రాయితీతో రైతులకు డ్రోన్లను అందిస్తోంది. ప్రతి మండలానికి ఒక యూనిట్ చొప్పున చిత్తూరు జిల్లాకు 31 యూనిట్లు మంజూరు అయ్యాయి. ప్రతి యూనిట్‌లో ఐదుగురు రైతుల గ్రూపులను లబ్ధిదారులుగా గుర్తించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎంపికైన రైతులకు నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించి డ్రోన్ పైలట్ సర్టిఫికేట్ ఇచ్చారు.
ఇప్పటి వరకు 28 డ్రోన్లు జిల్లా రైతుల చేతికి చేరగా, మిగిలిన మూడు యూనిట్లు వారం రోజుల్లో రానున్నాయి. అదనంగా ఇఫ్కో కంపెనీ తరఫున బైరెడ్డిపల్లి, చౌడేపల్లి మండలాలకు మూడు డ్రోన్లు అందజేశారు. ఒక్కో డ్రోన్ యూనిట్ ధర రూ.9.80 లక్షలు కాగా, రైతు వాటా కేవలం రూ.1.96 లక్షలు మాత్రమే. మిగిలిన రూ.8 లక్షలను ప్రభుత్వం భరిస్తోంది. రైతుల వాటాను బ్యాంకు రుణాల ద్వారా మంజూరు చేసి డ్రోన్ కంపెనీలకు నేరుగా చెల్లించే విధానం అమలులో ఉంది. డ్రోన్‌తో ఒక ఎకరంలో పురుగు మందు పిచికారీ చేయడానికి కేవలం ఏడు నిమిషాల సమయం చాలు. అదే పని రైతు చేతితో చేయాలంటే.. రెండు గంటలకు పైగా పడుతుంది. డ్రోన్ 12 లీటర్ల నీటితో ఒక ఎకరానికి స్ప్రే చేయగలదు. చేతితో అయితే.. దాదాపు 100 లీటర్ల నీరు అవసరం అవుతుంది. డ్రోన్ పిచికారీతో మందు వృథా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఎకరాకు రూ.350 వసూలు చేస్తున్నారు. రోజుకు సుమారు 10 ఎకరాల వరకు పిచికారీ చేయగల సామర్థ్యం ఈ డ్రోన్లకు ఉంది.
డ్రోన్‌ల వినియోగంతో రైతులు నేరుగా రసాయనాలకు గురికాకపోవడంతో ఆరోగ్యపరంగా కూడా ఇది ఎంతో మేలు చేస్తోంది. సాధారణ పద్ధతిలో మందులు చల్లే సమయంలో రైతుల ముక్కు, నోరు, ఊపిరితిత్తుల ద్వారా విషపదార్థాలు శరీరంలోకి ప్రవేశించి దీర్ఘకాల వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు మండలాల్లో డ్రోన్ సాంకేతికత పై అవగాహన శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో రైతులకు పిచికారీ విధానం, భద్రతా జాగ్రత్తలు, డ్రోన్ సంరక్షణ వంటి అంశాల పై వివరాలు ఇచ్చారు.
ఈ విషయమై వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ (Murali Krishna) మాట్లాడుతూ.. రైతులు సాంకేతికతను స్వీకరించడంలో ముందడుగు వేస్తుండటం అభినందనీయం అన్నారు. ప్రభుత్వం స్మార్ట్ అగ్రి మిషన్ కింద డ్రోన్ వినియోగానికి సబ్సిడీలు, శిక్షణా కార్యక్రమాలు, సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. త్వరలో ప్రతి మండలంలో డ్రోన్ సర్వీస్ సెంటర్లు స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

