Chittoor | ఘ‌నంగా వడ్డే ఓబన్న జయంతి…

Chittoor | ఘ‌నంగా వడ్డే ఓబన్న జయంతి…

Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లాలో రేనాటి సమరయోధుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా సాయుధ దళం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్ వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దేవదాస్ మాట్లాడుతూ… బ్రిటిష్ సామ్రాజ్యానికి తెలుగునాట తొలిసారి సవాల్ విసిరిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సన్నిహిత మిత్రుడైన వడ్డే ఓబన్న జీవితాంతం తన స్నేహితుడి వెంట నిలిచి పోరాటం చేసిన నిజమైన వీరుడని తెలిపారు. జీవితంలోను, యుద్ధంలోను, మరణంలోను నరసింహారెడ్డికి తోడుగా నిలిచిన ధీరుడిగా వడ్డే ఓబన్న చరిత్రలో నిలిచారని అన్నారు. నంద్యాల జిల్లాలోని సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు జనవరి 11న వడ్డే ఓబన్న జన్మించారని చెప్పారు. 1857 సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా పరిగణించినా, అంతకుముందే 1846లోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి వడ్డే ఓబన్న బ్రిటిష్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు పోరాడారని గుర్తు చేశారు.

శిస్తుల వసూలు విషయంలో ఈస్టిండియా కంపెనీ అధికారులకు, రేనాటి పాలెగాళ్లకు మధ్య మొదలైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయని, ఆ పోరాటంలో సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న కీలక పాత్ర పోషించారని వివరించారు. సుమారు 10 వేల మంది వడ్డెరలు, బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు. వడ్డే ఓబన్న ధైర్యసాహసాలు, కర్తవ్యనిష్ఠ, ప్రజల పట్ల సేవాభావం ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా పోలీసు సిబ్బందికి ఆదర్శప్రాయమని దేవదాస్ తెలిపారు. చట్ట పరిరక్షణ, ప్రజాసేవ, న్యాయం కోసం పనిచేసే ప్రతి పోలీసు వడ్డే ఓబన్నను స్ఫూర్తిగా తీసుకుని మరింత అంకితభావంతో విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అడ్మిన్ సుధాకర్, ఆర్‌ఐ ఎమ్‌టీఓ వీరేశ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply