తమకు కలిగిన ఆపదలకు, వచ్చిన కష్టాలకూ వేరెవరినో కారకులుగా భావించి బాధపడటం, నిందించడం మానవ నైజం. అందుకు భగవంతుడు కూడా మినహాయింపు కాడు. ”ఎన్ని పూజలు చేశాము, ఎన్ని నోములు నోచాము, మాకే ఎందుకో ఈ బాధలు అర్థం కాదు. అసలు దేవుడు ఉన్నాడా అని అనిపిస్తుంది” అనే మాటలు చాలా సందర్భాలలో వింటూ ఉంటాం. అదేదో దేవుడిని ఉద్ధరించడానికి తాము పూజలు చేసినట్లు, తాము చేసిన పూజలకు దేవుడు కృతజ్ఞత చూపనట్లు జనుల భావన. భక్త రామదాసు వంటి మహా భక్తులే బాధలకు తాళలేక భగవంతుని నిందించి, తర్వాత తమ తప్పు తెలుసుకొని, క్షమించమని దేవుని కోరిన గాథలూ మనకు తెలిసినవే.
కలియుగంలో కేవలం నామస్మరణ మాత్రం చేతనే భగవంతుడు ప్రసన్నుడవుతాడని పురాణాలు పేర్కొన్నాయి. అయితే భక్తి విశ్వాసాలు లేకుండా, ఏదో మొక్కుబడిగా దేవుని తలవడం, హడావిడిగా పూజ అయిందనిపించడము మన యాంత్రిక జీవితంలో భాగంగా మారిపోయాయి. కష్టాలు కలిగినప్పుడు మాత్రం ఏదో ఎమర్జన్సీ కాల్ బటన్ నొక్కినట్లుగా ”స్వామీ! నన్ను కాపాడు” అనుకోవడం మామూలై పోయింది. చిత్త శుద్ధి లేని పూజ దైవానికి ఎలా రుచిస్తుంది? తప్పు మనలో పెట్టుకొని దోషాన్ని దైవానికి అంటగట్టడం ఎంత వరకు సబబు ?
ఒక హిందీ కవి చెప్పినట్లు ”లోగ్ క హేతే హే భగవాన్ ఆతే నహి, మగర్ మీరాకే జైసే బులాతే నహి”. భక్త మీరాబాయి లాగా భక్తితో పిలిస్తే కదా భగవంతుడు వచ్చేది. ఊరకే ”రా దిగిరా … దివి నుండి భువికి దిగిరా” అంటే సరిపోతుందా. శబరిలాగా సభక్తికంగా తినిపిస్తే దేవుడెందుకు మనం పెట్టిన నైవేద్యం తినడు? యశోదమ్మలా నిద్ర పుచ్చితే ఎందుకు పవ్వళింపడు?
హనుమంతునిలా భావిస్తే మన హృదయంలో ఎందుకు నివసించడు? గోపికలా తన్మయత్వంతో స్మరిస్తూ నర్తిస్తే ఎందుకు మనతో నాట్యమాడడు? ఆర్తితో, భక్తితో, విశ్వాసంతో, గజేంద్రునిలా, ద్రౌపదిలా సర్వస్వ శరణాగతి చేస్తే దైవానుగ్రహం తప్పక కల్గుతుంది.
ఏకాగ్ర చిత్తంతో ఏదో ఒక ఇష్ట దేవతా రూపాన్ని ధ్యానించడాన్ని ఏకాంత భక్తి అంటారు. ఇది చాలా గొప్ప ఫలితాన్నిస్తుంది. మనలో చాలా మంది సోమవారం శివుని, మంగళవారం హనుమంతుని, బుధవారం శ్రీరాముని, గురువారం సాయిబాబాను, శుక్రవారం లక్ష్మీ దేవిని, శనివారం ఏడుకొండల స్వామిని, ఆదివారం సూర్యుని ఇలా రోజుకొక దేవుని, రోజుకొక స్తోత్రాన్ని, రోజుకొక దేవాలయాన్ని, భజించడం, జపించడం, దర్శించడం చేస్తూ ఉంటాము. ఒక్క దేవుడైనా మనలను రక్షింపక పోతాడా అని మన నమ్మకం. అంతే తప్ప దేవుడు ఒకడే అనే భావన మన మనసులోకి రానివ్వం. ఎప్పుడూ ఏక చిత్తంతో దేవుని స్మరించాలికానీ, అన్య మనస్కంగా, ఆందోళనతో నామస్మరణ చేస్తే ఫలితం ఉండదు.
ఒక హిందీ కవి ఇలా చమత్కరించాడు. ”మేరీ హందీ దునియామే మై హూ ఉత్తమ, తూ మధ్యమ / తేరీ గందీ దునియామే, తూహే ఉత్తమ, మై మధ్యమ”.
ఏ భాషలోని వ్యాకరణంలోనైనా ‘నేను’ అనే పదం ఉత్తమపురుష. ‘నీవు’ అనే పదం మధ్యమ పురుష. ‘అతడు’ లేక ‘వాడు’ అనే మాట ప్రథమ పురుష. ఓ దేవదేవా ! నేను సృష్టించుకొన్న వ్యాకరణంలో నన్ను ఉత్తమునిగా, నిన్ను మధ్యమునిగా చిత్రించాను. కానీ నిజానికి నీవే ఉత్తముడవు. నేను మధ్యముడను. నన్ను రక్షించు అని భావించాలి.
ఆర్తితో, ఆత్మీయతతో, విశ్వాసంతో పిలిస్తే దేవుడు తప్పక పలుకుతాడు. కరుణిస్తాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వాల్మీకి రామాయణంలో చెప్పాడు. ”సకదేవ ప్రపన్నాయ తవా స్మీతి చ యాచతే / అభయం సర్వ భూతేభ్యో దదామ్యేత ద్వ్రతం మమ”. ఒక్కసారైనా త్రికరణ శుద్ధిగా నా శరణు వేడి, నేను నీ వాడను అని రక్షణ కోరితే ఏ ప్రాణికైనా సరే నేను అభయ మిస్తాను అన్నది ఆ భగవంతుని ప్రతిజ్ఞ. ఆర్తితో ఆయనను అలా వేడుకోవడము మాత్రమే మనం చేయాల్సిన పని.
సర్వే జనా: సుఖినోభవంతు.
—
– గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి