ఆన్సైట్ ఎఫ్ఐఆర్తో బాధితుల వద్దకే పోలీస్ సేవలు…

ఆన్సైట్ ఎఫ్ఐఆర్తో బాధితుల వద్దకే పోలీస్ సేవలు…
అచ్చంపేట డిఎస్పి పల్లె శ్రీనివాస్
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట డివిజన్లో పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి “ఆన్సైట్ ఎఫ్ఐఆర్” విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో నాగర్కర్నూల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే పోలీసులు స్వయంగా వెళ్లి ఫిర్యాదు నమోదు చేయడం ఈ విధానం ప్రధాన లక్షణమని ఆయన వివరించారు.
ఈ చర్య వల్ల బాధితులకు సమయానికి న్యాయం అందడమే కాకుండా, పోలీస్ సేవలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, లైంగిక దాడులు, ఎస్సీ/ఎస్టీ అఘాయిత్యాలు, చోరీలు, దోపిడీలు, వృద్ధులపై నేరాలు వంటి కేసుల్లో ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని తెలిపారు. అలాగే డౌరీ, బాల్య వివాహాలు, ర్యాగింగ్ వంటి ప్రత్యేక చట్టాల పరిధిలోని కేసులు కూడా ఈ విధానంలో నమోదు చేయబడతాయని చెప్పారు.
ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు, దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని డీఎస్పీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఘటన స్థలానికే వెళ్లి ఫిర్యాదు స్వీకరించడం ద్వారా కేసులపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం కలుగుతోందన్నారు. బాధితులు నిర్భయంగా ముందుకు వచ్చి ఈ సేవను వినియోగించుకోవాలని ఆయన కోరారు. “ప్రజలకు చేరువగా ఉండే పోలీసింగ్ ద్వారా సమస్యలను వెంటనే పరిష్కరించడం మా లక్ష్యం” అని స్పష్టం చేశారు.
