ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఒక విషాద సంఘటనలో, ఒక సంవత్సరం వయసున్న పాప పురుగుని మింగి ఊపిరాడక మరణించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. తిరువళ్లూరు జిల్లా పెరియపాళ్యం సమీపంలోని తామరైపాక్కానికి చెందిన రైతు కూలీ కార్తిక్, అతని భార్య కవిత దంపతులకు గుగశ్రీ అనే ఒక సంవత్సరం కుమార్తె ఉంది. సోమవారం ఉదయం గుగశ్రీ ఇంట్లో ఆడుకుంటూ అనుకోకుండా ఒక పురుగుని మింగింది. ఆ పురుగు గొంతులో ఇరుక్కుపోవడంతో చిన్నారి ఊపిరాడక ఇబ్బంది పడింది.
తల్లిదండ్రులు వెంటనే గమనించి, గుగశ్రీని తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, చికిత్స పొందుతూ గుగశ్రీ తుది శ్వాస విడిచింది. ఈ విషాద ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తమ చిన్నారిని కోల్పోయిన తల్లిదండ్రులు మరియు బంధువుల రోదనలు ఆసుపత్రి ప్రాంగణంలో అందరినీ కంటతడి పెట్టించాయి. ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.