ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గత కొన్నిరోజులుగా హైదరాబాద్(Hyderabad)ను వర్షాలు వదిలిపెట్టడం లేదు. భారీ వర్షాలు(roads) మహా నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రతీ రోజు సాయంత్రమైందంటే చాలు వరుణుడు ఎక్కడ గర్జిస్తాడోనని సిటీలో జనం జంకుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో భాగ్యనగర జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. గంటల పాటు కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ వాగుల(river)ను తలపిస్తున్నాయి. దారులపై వరద పోటెత్తుతుండటంతో చెరువుల్లో పడవల్లా వాహనాలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి నానా అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్‌లో ఈ బాధలు ఎప్పుడు తప్పుతాయా అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఈ దారుణ పరిస్థితులపై తెలంగాణ(Telangana) ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంది. ఎట్టకేలకు అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వర్షాలతో ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కార మార్గాలపై ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.
శాశ్వత పరిష్కారం దిశగా…
వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండడమే హైదరాబాద్ నగరంలో ఈ దుస్థితి తలెత్తుతోందని అధికారులు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోని వరదనీరు మూసీని చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ చెరువు, నాలాలు, ఇతర కాలువలను మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు.
పూర్తి ‘ప్రక్షాళన’ దిశగా అడుగులు
ప్రస్తుతం నగరంలోని రోడ్లు, డ్రైనేజీలు 5 సెంటీమీటర్ల వర్షాన్ని కూడా భరించలేవు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో తాగునీరు, వరదనీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వంటి అన్ని వ్యవస్థలను పూర్తిగా అప్‌డేట్ చేసి, వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
పట్టాలెక్కనున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో వరద సమస్యకు మూసీ పునరుజ్జీవనమే శాశ్వత పరిష్కారం అని సీఎం స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ కింద 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించనున్నారు. హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు, మీర్ అలం చెరువు వంటి ప్రధాన జలాశయాలను నాలాల ద్వారా మూసీతో అనుసంధానం, నాలాల వెడల్పు ప్రక్రియ వేగవంతం చేయడం, కలుషిత నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపి, శుద్ధి చేసిన నీరు మాత్రమే మూసీకి చేరేలా సిస్టమ్ అమలు, ఈ చర్యలు పూర్తయితే నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపు సమస్య నుండి పూర్తిగా బయటపడతాయి.
మూసీకి అనుసంధానంగా చెరువులు
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌తో పాటు నగరంలోని చెరువులు, కుంటలను కూడా పునరుద్ధరించనున్నారు. హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు, మీర్ అలం చెరువుతో పాటు చిన్నచిన్న చెరువులు కూడా నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయబడతాయి. దీనివల్ల వర్షపు నీరు నేరుగా కాలనీల్లోకి చేరకుండా, చెరువుల ద్వారా నిల్వవుతుంది. ఎంత వర్షం పడినా, గ్రేటర్ హైదరాబాద్‌లో నీరు నిల్వ కాకూడదు, లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కాకూడదని సిఎం అన్నారు. దీనికోసం ఆధునిక డ్రైనేజ్ నెట్‌వర్క్, చెరువుల అనుసంధానం, మూసీ పరిరక్షణ, మరియు సముద్ర మట్టానికి సరిపడే ఇంజనీరింగ్ సొల్యూషన్లు ఉపయోగించబడతాయి.
మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్‌లతో పార్కింగ్ సమస్యకు చెక్
వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతోందని గుర్తించిన సీఎం, ముఖ్యంగా పాతనగరంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో పెడిస్ట్రియన్ జోన్ ఏర్పాటు చేయాలన్నారు. మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్‌లతో పార్కింగ్ సమస్యకు పరిష్కారం, వర్షాకాలంలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.
విపత్తు విభాగం అప్రమత్తత అవసరం
వర్షాలు, వరదల సమయంలో నగరవాసుల ప్రాణాలు, ఆస్తులు సురక్షితంగా ఉండాలంటే విపత్తు నిర్వహణ విభాగం, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, వాటర్ బోర్డు వంటి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అధికారులు పనిచేయాలని సీఎం ఆదేశించారు.