Chandrasekhar Reddy | సర్పంచ్ గా మరో అవకాశం ఇవ్వండి
ఊరి కోసం లక్షల విలువచేసే రెండు ఎకరాల భూమి ఇచ్చా
మక్తల్, ఆంధ్రప్రభ : సర్పంచ్‌గా తమకు మరో అవకాశం ఇవ్వండి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నిస్వార్ధంగా పనిచేయడమే తన లక్ష్యమని నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గుర్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ రెబల్( స్వతంత్ర) అభ్యర్థిగా బరిలో నిలిచిన చంద్రశేఖర్ రెడ్డి గ్రామస్తులకు విన్నవించారు. గత ఎన్నికల్లో గ్రామస్తులందరి అభిప్రాయం మేరకు ఊరి అవసరాల కోసం లక్షల విలువచేసే రెండు ఎకరాల భూమిని గ్రామానికి ఇచ్చాను అన్నారు. ఐదేళ్ల కాలంలో తన శక్తి మేర గ్రామాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. ఈ రోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అయిన సందర్భంగా ఆయన తన సతీమణి మాజీ సర్పంచ్ కళావతి చంద్రశేఖర్ రెడ్డి ఇతర మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయడమే కాకుండా రెండు ఎకరాల భూమిని ఇచ్చానని పార్టీ ఆదేశాల మేరకు పనిచేశానని అయినా తనకు మరో అవకాశం ఇవ్వకుండా పార్టీ నాయకత్వం ఇతరులకు అవకాశం కల్పించడం బాధాకరమన్నారు. విద్యార్థులకు ఆటో సదుపాయం కల్పిస్తానని ఇతర హామీలన్నీ అమలు చేసేందుకు బాండ్ రాసి ఇస్తానని గ్రామస్తులకు సర్పంచ్ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి మాటిచ్చారు. గ్రామం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న తనను గ్రామస్తులు ఆదరించి మరోసారి అవకాశం ఇవ్వాలని లేదంటే ప్రజల తీర్పును శిరసా వహించి గ్రామ రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

