భూగర్భ జలాలు పెంపొందించుకోవాలి…

భూగర్భ జలాలు పెంపొందించుకోవాలి…

నేరడి బ్యారేజీ పూర్తి అయితే జిల్లా సస్యశ్యామలం
నీటి భద్రత పనులు వంద రోజుల్లో పూర్తి కావాలి

రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : భూగర్భ జలాలు పెంపొందించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రానున్న తరాలవారికి కూడా అవసరమైన కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు . నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత వంద రోజుల కార్యక్రమానికి ఆయన సంతబొమ్మాలి మండలం నౌపడా వద్ద శంఖు స్థాపన చేశారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యతని తెలిపారు.

నీరు లేకపోతే మానవాళి మనుగడకు ముప్పని, మానవాళి జీవనానికి నీరు అత్యంత ముఖ్యమని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక బాధ్యత పైనా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. వర్షం పడినపుడు ఆ నీరు బయటకు వెళ్లకుండా నిలపితే భూ గర్భ జలాలు పెరుగుతాయన్నారు. గతంలో నీరు చెట్టు కార్యక్రమాలు చేపట్టామని, దాని వలన వర్షం నీరు భూమిలో ఇంకి భూ గర్భ జలాలు పెరుగేవన్నారు. ప్రభుత్వం మారిన తరువాత వాటిని పూర్తిగా వదిలేశారన్నారు. బాగు చేయాల్సిన చెరువులను 15 రోజుల్లో నీటి సంఘాలు పరిశీలించి గుర్తించాలన్నారు.

గుర్తించిన వాటికి సంబంధించిన ప్రతిపాదనలు కలెక్టర్ కు పంపాలన్నారు. వంద రోజుల్లో పనులు పూర్తి చేసి ఖరీఫ్ నాటికి అందుబాటులో నీరుండాలని చెప్పారు. పనులు పూర్తి చేయకముందు 6 మీటర్లు దూరంలో ఉన్న నీరు వర్షాకాలంలో 3 మీటర్ల లోతులో నీరు ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 5700 గ్రామాల్లో నీరు ఎక్కడా రావడం లేదని తెలిపారు. రాష్ట్రంలో 60 వేల నీటి సంఘాలు ఉన్నాయని, వీరికి రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేసిన బాధ్యతలు నెరవేర్చాలన్నారు. ఫారం పాండ్స్ అప్పటి ప్రభుత్వం తవ్వగా, ప్రభుత్వం మారిన తరువాత ఫారం పాండ్స్ కనుమరుయ్యాయని, వాటిని గుర్తించాలన్నారు.

నీరు చాలా ప్రాముఖ్యమైనదని, ఖరీఫ్ నాటికి నీటి సమస్య ఉండకూడదని, ప్రతీ ఎకరాకు నీరు ఉండాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తే పరిప్రమలకు నీరు అందించాలన్నారు. వంశధార ఆర్ఎంసి, ఎల్ఎంసి ద్వారా రెండు పంటలకు నీరు అందించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వంలో వంశధార పనులు చేపట్టామని ప్రభుత్వం మారిన తరువాత పనులు ఆగిపోయాయన్నారు. ఆర్ఎంసీ, ఎల్ఎంసీ నిర్మించాలంటే కొన్ని గ్రామాలు ఖాళీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేరడి బ్యారేజీ నిర్మిస్తే పక్క రాష్ట్రం, మన రాష్ట్రంలో కొన్ని గ్రామాలు ముంపుకు గురవుతాయని, వీటి సర్వేకు కేంద్ర ప్రభుత్వం ఒక ఏజన్సీకి అప్పగించిందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు పట్టి నేరడి బ్యారేజీకి ఒక మంచి లాయర్ ని ఏర్పాటు చేయడమైనదని, ఆ లాయర్ రాష్ట్రం నుండి వాదనలు వినిపించినట్లు చెప్పారు. కేంద్రంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కో ఆర్డినేట్ చేసినట్లు వివరించారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నచ్చినట్లు తెలిపారు . నేరడి బ్యారేజీ పూర్తయితే మన ఇష్టం వచ్చిన పంటలు పండించుకోవచ్చన్నారు. నేరడి బ్యారేజీ నిర్మిస్తే లిఫ్ట్ ఇరిగేషన్ తీసివేయాలన్నారు. నేరడి బ్యారేజీ పూర్తి అయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చేసిన పనులు ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని కొనియాడారు.

టెక్కలి నియోజకంలో తాగునీటికి 630 కోట్ల రూపాయిలు మంజూరు చేసినట్లు చెప్పారు. తాను మంత్రి అయిన తర్వాత ఆర్ అండ్ ఆర్ కాలనీకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు . ఈ ప్రాంతంలో తాగునీటికి రెండు కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వంశధార నీరు ఆర్ అండ్ ఆర్ కాలానికి అందజేస్తామన్నారు.

ఆర్ అండ్ ఆర్ కాలనీకి భవనాలు నిర్మించే వరకు రేకులు అందించాలని కాంట్రాక్టర్ కు తెలియజేస్తే రేకులు అందజేసినట్లు వివరించారు . రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయం మేరకు 3 అడుగుల లోతులో నీరు ఉండాలనే ఆశయం నెరవేరాలన్నారు. నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత పనులు ఒక యజ్ఞంలా పనిచేసి వంద రోజుల్లో పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ ప్రాంతంలో 3 చెరువులు ఉన్నాయని, అవి బాగుచేసేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ, నౌపడ ఆర్ అండ్ ఆర్ కాలనీలో వర్షా కాలం ముందు ఈ పనులు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. 90 రోజుల్లో పూర్తి కావాలని, విబిజి రాంజీ నాలుగు దశల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పారు. ఇక్కడ అటవీ శాఖ, మైక్రో ఇరిగేషన్, ఉద్యానవన శాఖ, తదితర శాఖల అధికారులు ఉంటారన్నారు. ట్రంచ్ లు, తదితరమైనవి కట్టడంజరుగుతుందని చెప్పారు. ఈ పనులు ప్రారంభించి సత్వరమే ప్రారంభించాలన్నారు.

రాష్ట్రంలో విజయనగరం జిల్లా తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 6700 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నట్లు తెలిపారు . భూ గర్భ జలాలు పెంపొందించాలని, జిల్లాలో 30 మండలాల్లో కొన్ని మండలాల్లో నీటి లభ్యత తక్కువగా ఉందన్నారు. నేరడి బ్యారేజీ పూర్తి అయితే జిల్లాలో భూ గర్భ జలాలు పెరుగుతాయన్నారు. 90 రోజుల్లో పనులు పూర్తి అయితే ఖరీఫ్ నాటికి నీరు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, ఎపిఈపీడిసియల్ ఎస్ఈ కృష్ణమూర్తి, ఆర్డీఓ కృష్ణమూర్తి, పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరి వర ప్రసాద్, ఇరిగేషన్ ఈఈ శేఖర్, డ్వామా లవరాజు, నియోజకవర్గానికి సంబంధించి నీటి సంఘాల అధ్యక్షులు, నీటి సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply