ముగిసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండక్షన్ కార్యక్రమం

ముగిసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండక్షన్ కార్యక్రమం
డేటా సైన్స్, ఏఐ విద్యార్థులకు రోబోటిక్స్, ఆధునిక సాంకేతికతలపై ప్రాయోగిక శిక్షణ
మూడు రోజుల పాటు అకట్టుకున్న వర్క్‌షాప్‌లో రోబో రేస్ పోటీలు
విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడలోని పరవతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో నిర్వహించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండక్షన్ కార్యక్రమం ఉత్సాహభరితంగా ముగిసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో మార్చి 9 నుండి 11 వరకు కళాశాల వెబినార్ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎంఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ డేటా అనలిటిక్స్ బీఎస్సీ ఈఎల్ఈ రెండో సంవత్సరం విద్యార్థులు సుమారు 150 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో ప్రముఖ శిక్షణ సంస్థ హాక్‌బోట్స్‌కు చెందిన నిపుణులు విశాల్, దేవేంద్ర సాయి రిసోర్స్ పర్సన్లుగా పాల్గొని రోబోటిక్స్ , ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ అందించారు.
దీంతో విద్యార్థులు ఆధునిక సాంకేతికతలపై ప్రాయోగిక అవగాహనను పొందారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా నిర్వహించిన రోబో రేస్ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు రూపొందించిన రోబోలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌పై పోటీగా పరిగెత్తడంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ పోటీల ద్వారా విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభ, సృజనాత్మకత జట్టు భావనను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. మేక రమేష్ డీన్ డా. రాజేష్ సి. జంపాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని డా. కొంపల్లి ఉదయశ్రీ, డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి సమన్వయం చేశారు.
