తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వానికి (central government) ముందు చూపు లేకపోవడంతో దేశవ్యాప్తంగా యూరియా (urea) కొరత ఏర్పడిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) ఆరోపించారు. యూరియా సరైన సమయానికి రాకపోవడం వల్ల రైతాంగం ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ(Telangana)లో సాగు చేసే పంటలకు సెప్టెంబర్ నెలలో ఎరువులు చాలా అవసరం ఉంటుందన్నారు. అందుకనుగుణంగా కేంద్రం ఎరువులు అందించడంలో విఫలమైందన్నారు. వానాకాలం సీజన్‌కి 11 లక్షలు మెట్రిక్ టన్నులు అడిగామని, 9.8 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తామన్నారని, ఇప్పటివరకు 5.20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో బ్లాక్ మార్కెట్‌కి ఆస్కారం లేదని, జిల్లా కలెక్టర్ల వద్ద పూర్తి సమాచారం ఉంటుందన్నారు. యూరియా సమస్య ఒక్క తెలంగాణదే కాదని, దేశవ్యాప్తంగా ఈ ప్రాబ్లం ఉందన్నారు. చైనా నుంచి ఎర్ర సముద్రం మీదుగా వచ్చే యూరియా రాకపోవడం వల్ల కొరత ఏర్పడిందన్నారు. కేంద్ర వైఫల్యం వల్ల కారణంగా దేశీయంగా ఉత్పత్తి పెంచకపోవడం వల్ల యూరియా కొరత వచ్చిందన్నారు.
భారీ వర్షాలతో పంటలకు నష్టం
తెలంగాణలో భారీ వర్షాల (Heavy rains) కారణంగా ప్రాథమిక అంచనా ప్రకారం 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణ రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరతామని ఆయన అన్నారు. రామగుండం (Ramagundam)లో నాలుగు నెలలుగా ఉత్పత్తి లేదని, ఇంకా 15 రోజుల వరకు ఉత్పత్తి జరిగే పరిస్థితి లేదన్నారు. కొత్తగూడెం ఎయిర్ పోర్టు (Kothagudem Airport) అంశంపై రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu)ను కలుస్తామని, గత వరదల విషయంలో సాయం చేయలేదన్నారు. ఈ విషయంపై జేపీ నడ్డా, అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, రామ్మోహన్ నాయుడు, అశ్విని వైష్ణవ్ ను కలుస్తామన్నారు. ఈ రెండు రోజుల్లో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలు కేంద్ర మంత్రులకు వివరిస్తామన్నారు.