Celebrations | చిరకాల స్వప్నం..

Celebrations | నందిగామ, ఆంధ్రప్రభ : వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం మరమ్మత్తుల కోసం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని తమ కార్యాలయంలో రైతులు, రైతు నేతలు, కూటమి నేతలతో కలిసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం ఈ ప్రాంత రైతాంగానికి చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. ఈ పథకానికి మరమ్మత్తుల నిమిత్తం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రైతుల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. మేము ప్రతిపక్షంలో ఈ పథకం పై అలుపెరగని పోరాటం కొనసాగించామని ఆమె గుర్తు చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండవ రోజే ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుని ప్రత్యేకంగా కలిసి వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం పై వినతిపత్రం అందజేశామని తెలిపారు.

Celebrations

అలాగే ఈ ఏడాది కాలంలో పలుమార్లు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ (చిన్ని) తో కలిసి సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించామని తెలియజేశారు. ముప్పాళ్ళ పి–4 కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రివర్యుల దృష్టికి రైతుల సమస్యలను తీసుకువెళ్లినట్లు వివరించారు. గత ఐదేళ్లుగా రైతుల బాధలు, వారి కన్నీళ్లు ప్రత్యక్షంగా చూశామని, ఈరోజు రైతన్న కళ్లల్లో ఆనందం కనిపిస్తుండటం ఎంతో ఆత్మసంతృప్తినిస్తోందని ఎమ్మెల్యే సౌమ్య అన్నారు. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, ఇది పూర్తిగా రైతు పక్షపాతి ప్రభుత్వమని స్పష్టం చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న భావనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయరంగంలో అనేక అధునాతన పద్ధతులను ప్రవేశపెట్టారని ప్రశంసించారు.

త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని ఎత్తిపోతల పథకాల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేసే దిశగా కొత్త కార్యాచరణ రూపొందిస్తున్నామని, అది అతి త్వరలో అమలులోకి రావాలని ఆకాంక్షించారు. రైతాంగ సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 17 వేల ఎకరాల అయకట్టు సాగు జరుగుతుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో లాల్ బహుదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోటా వీరబాబు, డీసీ చైర్మన్ రాటకొండ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, నీటి సంఘం అధ్యక్షులు, రైతు నేతలు, కూటమి నేతలు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply