CC roads | పల్లె పండగ 2.0

CC roads | పల్లె పండగ 2.0
- మారుతున్న గ్రామాల ముఖచిత్రం
- పల్లెలలో రహదారుల అభివృద్ధి
- ప్రజల ఆరోగ్య సంరక్షణ కూటమి ప్రభుత్వ ధ్యేయం
- మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
CC roads | జి.కొండూరు, ఆంధ్రప్రభ : పల్లెపండగ 2.0తో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. జి.కొండూరు మండలంలోని గంగినేని గ్రామంలో 15వ ఆర్థికసంఘం నిధులు రూ.36 లక్షలతో హెల్త్ సెంటర్ నిర్మాణానికి, రూ.25 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గ్రామాల్లో హెల్త్ సెంటర్ల నిర్మాణంతో ప్రజల సమగ్ర ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రజలకు వారి ఇంటి దగ్గర నాణ్యమైన వైద్యసేవలు అందించడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. ప్రధాని మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, మరోవైపు పేదల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు.

జి.కొండూరు-గంగినేని వరకు కేజీవై రహదారి ఈ జనవరి నెలాఖరులోగా పూర్తవుతుందన్నారు. మైలవరం నియోజకవర్గంలో రూ.30 కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశామన్నారు. పంచాయతీ రాజ్ బీటీ రహదారుల అభివృద్ధికి మరో రూ.12.20 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా పర్యవేక్షించామన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. గంగినేని గ్రామంలో అన్ని రోడ్లు సంపూర్ణంగా సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామని అన్నారు. గంగినేనిలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకి ఘనస్వాగతం లభించింది. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , స్థానిక ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
