ఆంధ్రప్రభ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: విహార యాత్ర (Excursion) నిమిత్తం వెళ్లి తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) యాచారం మండలం మాల్ సమీపంలో నాగార్జున సాగర్ రహదారి గత అర్ధరాత్రి చోటు చేసుకుంది. యాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన వాస సాయితేజ, వాస పవన్ కుమార్, రాఘవేందర్ లు హైదరాబాద్ బాలానగర్‌లో ఉంటూ ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్నారు.
కాగా మరో నలుగురు స్నేహితులతో కలిసి మంగళవారం నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) బ్యాక్ వాటర్ వైజాగ్ కాలనీకి వెళ్లారు. తిరిగి ప్రయాణంలో వస్తుండగా మాల్ దాటిన తరువాత ఎస్ఆర్ పెట్రోల్ బంకు సమీపంలో నాగార్జునసాగర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సాయితేజ (22), వాస పవన్ కుమార్(25),రాఘవేందర్ (25)లు ముగ్గురు అక్కడికి అక్కడే మృతిచెందగా వారి స్నేహితులు వాస శివకుమార్, వాస సాయికుమార్, ఎం.సందీప్, శివ కుమార్‌లకు తీవ్రంగా గాయడ్డారు. అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో వారిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.