Candidate | పదవుల కోసం కాదు…

Candidate | మక్తల్, ఆంధ్రప్రభ : ఆశీర్వదించండి.. అండగా నిలవండి.. గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించండి అంటూ మంథన్ గోడ్ బీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడి సర్పంచ్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని మంథన్ గోడ్ గ్రామపంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన ఆదివారం తన మద్దతుదారులతో కలిసి ప్రచారం చేపట్టారు. సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా.. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. స్థానికంగా అధికారం చెలాయించిన నాయకులు గ్రామ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేసిన నాయకులకు ఈ ఎన్నికల్లో చెంప చెల్లుమనిపించేలా తనను భారీ మెజారిటీతో సర్పంచిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామానికి సేవ చేయాలన్న తలంపుతో సర్పంచిగా బరిలో ఉన్నానని.. తనను గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందించడమే తన లక్ష్యమని అన్నారు. పదవుల కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేదలకు సేవ చేయాలన్న తలంపుతో సర్పంచ్ గా బరిలో నిలవడం జరిగిందన్నారు. తనను ఆదరించి ఆశీర్వదించి విలువైన ఓటు వేసి వేయించి భారీ మెజారిటీతో సర్పంచిగా గెలిపించి సేవ చేసే భాగ్యాన్ని తనకు కల్పించవలసిందిగా ఆయన గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ రాములు, ప్రతాపరెడ్డి దర్శన్ గౌడ్, శంకర్, ఆశన్న, పాండు, మల్లికార్జున్, బ్రహ్మయ్య, చంద్రయ్య, రాములు గౌడ్, రమేష్, శాంతప్ప, వెంకటేశ్వరమ్మ, వెంకటమ్మ, రాజేశ్వరి, సుధా, బాల్రెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply