Campaign | బెదిరింపులకు భయపడవద్దు..

Campaign | పరకాల, ఆంధ్రప్రభ : నాగారం గ్రామ ప్రజలకు బీజేపీ సర్పంచ్ అభ్యర్థి మాచబోయిన రవళి క్రాంతి కుమార్ విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మన గ్రామ ప్రజలు ఎవరి బెదిరింపులకు, ఒత్తిడులకు, తప్పుడు ప్రచారాలకు భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. గ్రామ అభివృద్ధి కోసం, మన భవిష్యత్తు కోసం తీసుకునే ప్రతి నిర్ణయం మన చేతుల్లోనే ఉంటుంది అని స్పష్టం చేశారు. అధికార పార్టీ తరఫున కొందరు వ్యక్తులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావని భయపెట్టి, తప్పుడు సమాచారాన్ని చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆయన అన్నారు. “ప్రభుత్వ పథకాలు ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా గ్రామానికి రావాల్సిందే, ఏ ప్రభుత్వానికైనా ప్రజల హక్కులను ఆపే అధికారం లేదు. కానీ ఈ విషయాన్ని వక్రీకరించి ఓట్లు అడగడం ప్రజలను మోసం చేయడమే” అని తెలిపారు.

రానున్న ఐదేళ్లలో గ్రామానికి అత్యవసరమైన పనులు పూర్తి చేసుకునే అవకాశం ఇప్పుడు గ్రామ ప్రజల చేతుల్లో ఉందని రవళి, క్రాంతి కుమార్ పేర్కొన్నారు. “మనం కలసి నడిస్తే.. నాగారం గ్రామం అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తుంది. త్రాగునీరు, డ్రైనేజీ, మహిళా శ్రేయస్సు, యువతకు ఉపాధి.. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించుకుని ఉన్నాం. ఈ కార్యక్రమాలు అమలు కావాలంటే ప్రజల మద్దతు ఎంతో అవసరం” అని వివరించారు.

గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వ వాతావరణం నెలకొల్పడం, ప్రతి కుటుంబం సమస్యలను వినడం, గ్రామాభివృద్ధి నిధులను పారదర్శకంగా వినియోగించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. “పార్టీ రాజకీయాలు కాదు.. ప్రజల అభివృద్ధే మా అజెండా” అని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించే వారిని గుర్తించి, వారికి తగిన సమాధానం ప్రజాస్వామ్య విధానంలోనే ఇవ్వాలని అన్నారు. “మీ ఒక్క ఓటు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అబద్ధాల, బెదిరింపుల, ప్రలోభాల రాజకీయాలకు ముగింపు పలకాలి” అని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలందరూ ఫుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి, నాగారం గ్రామ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. “ మీ మద్దతుతో వచ్చే ఐదేళ్లు నాగారం గ్రామానికి స్వర్ణయుగం కావాలి అని రవళి, క్రాంతి కుమార్ తెలిపారు.

Leave a Reply