By Election | జూబ్లీహిల్స్ కౌంటింగ్..
హైదరాబాద్, ఆంధ్రప్రభ – By Election ఉత్కంఠభరితంగా జరిగిన జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. ఇందుకు సంబంధించి యూసఫ్ గూడలోకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 58 మంది అభ్యర్థులు, ఒక నోటాతో కలిపి మొత్తం 59 మంది అభ్యర్ధుల ఈ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ముందుగా హోమ్ ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం సాధారణ ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఓట్లు లెక్కింపు కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేయగా 10 రౌండ్లలో కౌంటింగ్ చేయనున్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పలితాన్ని ప్రకటించనున్నారు.
కౌంటింగ్ ప్రక్రియ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం ఊరేగింపులు, బాణాసంచా కాల్చడం పై నిషేధం విధించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్ (Jubilee Hills counting) నియోజకవర్గం పరిధిలో మరోసారి మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఈసారి కొత్తగా హోమ్ ఓటింగ్ పేరుతో ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులు, 80 ఏళ్ల వయసు దాటిన వాళ్లు, పోలింగ్ కేంద్రానికి రాలేని పరిస్థితుల్లో ఉంటే.. వారికి ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించారు. దీనికి 103 మంది దరఖాస్తు చేసుకున్నారు. 101 మంది ఓటు వేశారు. కాగా ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా, 1,94,631 మంది ఓటు వేశారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో టేబుల్ కు ఒక సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్ లను మొత్తం 42 టేబుళ్లకు 126 మందిని నియమించారు.

