మెయిన్ సెంటర్‌లో పరిశుభ్రత అస్తవ్యస్తం…

మెయిన్ సెంటర్‌లో పరిశుభ్రత అస్తవ్యస్తం…
దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణీకులు
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి పారిశుధ్యం పూర్తిగా లోపించి దుర్గంధం వెదజల్లుతుంది. డ్రైనేజీలో మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు, ప్రయాణీకులు అనారోగ్యానికి గురవుతున్నారు. డ్రైనేజీ సక్రమంగా నిర్వహణ లేకపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చీమలపాడు మెయిన్ సెంటర్ కావడంతో పరిసర గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఇక్కడ బస్సు స్టాండ్ ఉన్నప్పటికీ అది నిరుపయోగంగా మారింది.ప్రయాణికులు ఎండకు, వర్షానికి, గంటల తరబడి నిలబడి బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ప్రయాణీ కులు కూర్చునేందుకు కనీస సదుపాయాలు కూడా లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
అంతేకాకుండా డ్రైనేజీ నుంచి వస్తున్న దుర్గంధంతో అక్కడ నిలబడటం కూడా కష్టంగా మారిందని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలు మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు కేవలం బ్లీచింగ్ చల్లి చేతులు దులుపుకుంటున్నారని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఈ విషయంలో పంచాయతీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వివిధ గ్రామాల ప్రయాణీకులు, గ్రామ ప్రజలు మండల స్థాయి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
