పెను ప్రమాదం తప్పింది
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమైంది. ఎయిర్ పోర్టులోని (Delhi Airport) మూడో టర్మినల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్యాక్సీయింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత సమీపంలో ఈ ఘటన జరిగింది.
ఆ సమయంలో బస్సు (Airport Bus) లో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గమనించిన ఎయిర్ పోర్టు సిబ్బంది వెంటనే మంటలు ఆర్పివేశారు. బస్సు సమీపంలో ఉన్న విమానం దెబ్బతినలేదని, అందులోని ప్రయాణికులంతా సురక్షితమేనని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఎస్ఏటీఎస్ ఎయిర్‌పోర్టు సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే థర్డ్ పార్టీ ప్రొవైడర్ ఎయిరిండియాకు ఈ బస్సు సర్వీసులను అందిస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే బస్సుకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు చేపట్టారు.

