ప్రారంభం నుంచే పైపైకి సూచీలు
సెన్సెక్స్ 1100 (1.60శాతం) పాయింట్లకు పైగా లాభం
నిఫ్టీ కూడా దాదాపు 400 (1.70శాతం) పాయింట్లకు పెరిగింది
కోలుకున్న ఆసియా మార్కెట్లు.. మదుపరుల్లో ఉత్సాహం
ముంబయి – ఆంధ్రప్రభ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. ఒక వైపు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోవడం.. మరో వైపు అమెరికా ప్రజల్లో ఆందోళన వ్యక్తం కావడంతో టారిఫ్ విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధమన్న సంకేతాలు ఇచ్చింది. దీంతో ఆసియాతో పాటు మన మార్కెట్లూ కోలుకుంటుంది. ఈ సారి ఆర్బీఐ నుంచి మరో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలు కూడా కలిసొచ్చాయి. సుంకాల విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధమన్న సంకేతాలతో ఆసియాతో పాటు మన మార్కెట్లూ రాణించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఓ దశలో 1600 పాయింట్లకు పైగా రాణించగా.. నిఫ్టీ కూడా 22,600 ఎగువకు చేరింది. ఆఖర్లో అమ్మకాల కారణంగా లాభాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
ఉదయం సెన్సెక్స్ 74,013.73 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 73,137.90) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 74,859.39 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 1089.18 పాయింట్ల లాభంతో 74,227.08 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 374.25 పాయింట్ల లాభంతో 22,535.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.27 గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్ గ్రిడ్ మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ 100, బీఎస్ఈ స్మాల్క్యాప్ 100 ఇండెక్సులు కూడా 2 శాతం మేర లాభాల్లో ముగిశాయి.
ఆసియా మార్కెట్లలో..
జపాన్ నిక్కీ ఇండెక్స్ దాదాపు 6% పెరిగింది. అలాగే హాంకాంగ్ ఇండెక్స్ కూడా 2% పెరిగింది. వీటితో పాటూ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్లో ట్రేడవుతున్న నిఫ్టీ కూడా 1.5% పెరిగింది. అలాగే నిఫ్టీ 50, సెన్సెక్స్ చార్టులు ఓవర్సోల్డ్ ఆర్ఎస్ఐ స్థాయిలను చూపుతున్నాయి. ఇది షార్ట్-కవరింగ్ , కొత్త కొనుగోళ్లకు దారితీస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక, ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా మంగళవారం కోలుకున్నాయి. జపాన్ నిక్కీ 5.68 శాతానికి పైగా లాభాల్లో ట్రేడవుతుండగా.. హాంగ్కాంగ్, షాంఘై మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభాల్లో ఉన్నాయి. అటు అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. డోజోన్స్ 0.91శాతం, ఎస్అండ్ సూచీ 0.23శాతం కుంగాయి. నాస్క్ మాత్రం 0.10శాతం లాభంతో రాణించింది. మంగళవారం నాటి సెషన్లో యూఎస్ మార్కెట్లు కూడా లాభపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నాయి.
ట్రంప్ ప్రకటనతో…
అమెరికా అధ్యక్షుడికి ఇంటా బయట పోరు తప్పడం లేదు. అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తే అధ్యక్ష పదవికే ఎసరు పడుతుందని ట్రంప్ భావించి కొంత దిగి వచ్చారు. సుంకాలపై చర్చకు కొన్ని దేశాలు ముందుకొచ్చాయని ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. ట్రంప్ కూడా కాస్త వెనక్కి తగ్గుతారనే అంచనాలున్నాయి. దీనివల్ల వాణిజ్య యుద్ధ ఆందోళనలు తగ్గుతాయనే సంకేతాలు సూచీల సెంటిమెంట్‌ను బలపర్చాయి. చైనా, వియత్నాం తదితర దేశాలతో పోల్చితే ట్రంప్ సుంకాల వల్ల కలిగే నష్టం మనదేశానికి తక్కువనే నిపుణుల అంచనాలతో మదుపర్లలో ఆందోళనలకు ఊరటనిచ్చాయి. అటు ముడిచమురు ధర తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్ల ర్యాలీకి ఓ కారణంగా మారింది. కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు సూచీలకు అండగా నిలిచాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బుధవారం (ఏప్రిల్ 9న) నిర్ణయాలు వెలువడనున్నాయి. 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం ద్వారా దేశీయంగా వృద్ధికి ఊతం లభిస్తుందని మదుపర్లు భావిస్తున్నారు.