హైదరాబాద్, ఆంధ్రప్రభ : అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూస్తే హామీల ఎగవేతల బడ్జెట్ లా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇది మొండి చేయి ఇచ్చే బడ్జెట్.. గొప్పలు చెప్పుకొనే బడ్జెట్.. కేవలం 36 వేల కోట్లతో అభివృద్ధి ఎలా సాధ్యమో భట్టి విక్రమార్క చెప్పాలన్నారు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేలా పెట్టారు అని మండిపడ్డారు. ఆదాయం చరానా.. అప్పు బరానా అన్నట్లు ఉంది.. బడ్జెట్ నిండా అప్పులే ఉన్నాయి.. రాష్ట్ర అప్పులు మరింత పెరిగే సూచికగా ఉంది.. ఇన్ని రకాలుగా అప్పులు చేసిన ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఈ సారి కూడా నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తారని అర్థం అయ్యింది.. మహిళలకు ఇస్తామన్న హామీలు ఎందుకు పొందు పర్చలేదో చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
రైతు భరోసాకు నిధులు ఎలా సరిపోతాయి?
రైతు భరోసాకి నిధులు ఏ రకంగా సరిపోతాయనేది చెప్పాలని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలకు బడ్జెట్ కేటాయించకపోవడం బాధకరమన్నారు. రైతులను మోసం చేసేలా ఉంది ఈ బడ్జెట్.. రైతులకు ఇచ్చిన హామీలు 42 వేల కోట్లు అవసరం.. అది ఎక్కడా బడ్జెట్ లో పెట్టకపోవడం చూస్తే.. మరోసారి రైతులను మోసం చేయబోతున్నారని అర్థం అవుతుందన్నారు. బీసీ సబ్ ప్లాన్ ప్రకారం బడ్జెట్ ప్రవేశ పెట్టకపోవడం ఎలా అని ప్రశ్నించారు. మైనారిటీలతో పోల్చుకుంటే 16 వేల కోట్లు బీసీలకు ఇవ్వాల్సి వస్తుందన్నారు. కానీ, 11 వేల కోట్లు మాత్రమే కేటాయించారంటే మైనారిటీలపై ఉన్న ప్రేమ బీసీల మీద లేదా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలని అన్నారు.