భూపాలపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన సభలో మాట్లాడిన కేటీఆర్, రైతులకు ఎంతో మేలు చేసిన కేసీఆర్ హయాంలో రూ.70 వేల కోట్ల మేర రైతుబంధు సాయం అందించామన్నారు. కానీ ఇప్పుడు… ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే రైతుబంధు వర్తిస్తోందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో కరోనా వంటి సంక్షోభం వచ్చినా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎప్పుడూ ఆగలేదని గుర్తుచేశారు. ఇప్పటి కాంగ్రెస్ పాలనలో రైతులు యూరియా కోసం క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని విమర్శించారు.
ఒక్కో ఆధార్ కార్డు మీద ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని, ఓ మహిళపై రెండు బస్తాలు ఎక్కువ తీసుకుందన్న కారణంతో నాన్‌బెయిలబుల్ కేసు పెట్టారన్నారు. నల్లబెల్లి గ్రామానికి చెందిన ఆ మహిళ తన, భర్త, కొడుకు ఆధార్ కార్డులు చూపించి మూడు బస్తాలు తీసుకుందన్నందుకు అరెస్టు కావడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఏడాదికి రూ.20,000 కోట్ల బడ్జెట్ బీసీల సంక్షేమానికి కేటాయిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. అలాగే 42 శాతం రిజర్వేషన్ల వాగ్దానం కూడా ఓ మోసమేనని విమర్శించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేయడం చేతకావడం లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లంకె బిందెలు, గల్లా పెట్టెలు కాదు.. ప్రభుత్వాన్ని నడపడానికి దమ్ము ఉండాలని అన్నారు. చేతకాని వాళ్లు నడిపితే పరిపాలన ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగించాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ధీమా వ్యక్తం చేశారు.