తెలంగాణ రాష్ట్ర సమితిగా తన ప్రస్థానం ప్రారంభించి. బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది ఇప్పుడు 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ.. ఈ సందర్భంగా, వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు.
సభకు హాజరైన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అంటూ తనదైన శైలిలో ప్రసంగం ప్రారంభించారు. కాగా, తన ప్రసంగానికి ముందు, కాశ్మీర్‌లోని పహల్గామ్ బాధితులకు కేసీఆర్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మంది ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఒక క్షణం మౌనం పాటించారు.
అనంతరం మాట్లాడిన కేసీఆర్, తాను ఒంటరిగా బయల్దేరి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించానని చెప్పారు. 25 ఏళ్ల క్రితం ఇదే గడ్డపై గులాబీ జెండాను ఎగురవేసినట్లు చెప్పారు. ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నమని.. పది సంవత్సరాలు అందరూ అశ్చరపోయేలా తెలంగాణను పాలించినట్లు ఆయన వెల్లడించారు.
ఆనాడు కాంగ్రెస్, టీడీపీ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని.. మన నడిగడ్డలో అసెంబ్లీలో నిలబడి చంద్రబాబు నాయుడు తెలంగాణ పదాన్ని నిషేధించారని తెలిపారు. తాను మాత్రం.. పదవులను త్యాగం చేసినట్లు వెల్లడించారు.
గతంలో అయినా, నేడు అయినా కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో నంబర్ వన్ విలన్ అని కేసీఆర్ అన్నారు. అనేక మంది బలిదానాలు, త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో ఫేయిల్ అయ్యిందని కేసీఆర్ అన్నారు. హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని సర్కారుపై కేసీఆర్ ఫైర్ అయ్యారు.
అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా ఏం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేళ్లు మాత్రమే సమయం ఉందని, అంతకు ముందే వారి మోసాలను బయటపెట్టాలని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ఏ అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను మళ్ళీ అద్భుతంగా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన మాకు.. కాంగ్రెస్ సంగతి ఎంటో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.