BRS | బ్యాలెట్ నమూనా ముద్రణపై
- ఎంపీడివోకి ఫిర్యాదు
- బ్యాలెట్ నమూనా ముద్రణ సరిగ్గా లేదని బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు
BRS | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మూడో విడత సాధారణ ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చెన్నారావుపేట మండల కేంద్ర సర్పంచ్ అభ్యర్థుల నమూనా బ్యాలెట్ ముద్రణ ఓటర్లకు ఇబ్బందికరంగా మారుతుందని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కంది శ్వేతకృష్ణ చైతన్య రెడ్డి ఇవాళ స్థానిక ఎంపీడివోకు ఫిర్యాదు చేశారు.
ఈసందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ… ఎన్నడూ లేని విధంగా ఒకే బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నంబర్ల ప్రకారం ఒకే కాలమ్ లో గుర్తులు రాకుండా రెండు కాలమ్స్ లో గుర్తులు ముద్రించారని, స్వస్తిక్ ముద్ర వల్ల ఒక గుర్తుపై ఓటు వేస్తే అది ఇంకో గుర్తుపై కూడా ఇంక్ అంటుకుని ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాత పద్దతిలో ఒకే కాలమ్ లో సీరియల్ నంబర్ల ప్రకారం బ్యాలెట్ పేపర్లను తిరిగి ముద్రించాలని పార్టీ పక్షాన కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుండే మల్లయ్య, జున్నుతుల మహేందర్ రెడ్డి, కుసుమ నరేందర్ లు పాల్గొన్నారు.
ఎనిమిది మంది కంటే ఎక్కువ అభ్యర్థులు ఉంటే రెండు కాలమ్స్ లోనే గుర్తులు ఉంటాయి
ఈ విషయమై ఆంధ్రప్రభ ప్రతినిధి జిల్లా పంచాయతీ అధికారి వివరణ కోరగా.. ఎనిమిది మంది అభ్యర్థుల కంటే ఎక్కువగా పోటీ ఉంటే ఒకే బ్యాలెట్ లోనే రెండు కాలమ్స్ లో సీరియల్ నెంబర్లు, గుర్తులు ముద్రించి వస్తాయన్నారు. చెన్నారావుపేటలో ఎనిమిది మంది సర్పంచ్ అభ్యర్థులు, నోటాతో కలిపి తొమ్మిది ఉండడంతో ఇక్కడ కూడా ఒకే బ్యాలెట్ రెండు కాలమ్స్ లో గుర్తులు ముద్రించి వచ్చాయన్నారు. పోలింగ్ అధికారులు ఎడమ వైపు మడతల, కుడి వైపు ఒక మడత చేసి ఓటర్లకు బ్యాలెట్ పత్రం ఇస్తారని, ఓటర్లు తాము నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత మడత చేసి బ్యాలెట్ బాక్స్ లో వేస్తే ఓట్లు చెల్లకుండా ఉండే ఆస్కారమే లేదన్నారు. ఎవరికి సందేహాలు ఉన్నా పోలింగ్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు నివృత్తి చేస్తారన్నారు.

