అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

నేను తెచ్చిన 100 పడకల ఆసుపత్రిని ఎందుకు పూర్తి చేయలేదు
భీమ్‌గల్ నా బిడ్డ లాంటిది.. కంటికి రెప్పలా కాపాడుకుంటా!
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో భీమ్‌గల్‌కు ఒరిగిందేమీ లేదు
భీమ్‌గల్ మున్సిపాలిటీ చివరి రోజు ఎన్నికల ప్రచారం
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

భీమ్‌గల్‌ టౌన్, ఫిబ్రవరి 9 ( ఆంధ్రప్రభ ) భీమ్‌గల్ మున్సిపాలిటీని రాబందులు, బకాసురుల భారినుండి కాపాడుకోవాల్సిన బాధ్యత పట్టణ ప్రజలందరిపై ఉందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం భీమ్‌గల్‌లో చివరిరోజు నిర్వహించిన బీఆర్ఎస్ అభ్యర్థుల భారీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని వేముల విమర్శించారు. “ఒకసారి నమ్మితే మోసం చేసినవాడిది తప్పు.. రెండోసారి కూడా నమ్మితే నమ్మినవాడిదే తప్పు అవుతుంది” అని పేర్కొంటూ, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో భీమ్‌గల్‌లో ఒక్క పైసా పని కూడా జరగలేదని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని వేముల ఆవేదన వ్యక్తం చేశారు
రూ. 11.5 కోట్ల నిధులు: తాను మంజూరు చేయించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను రెండేళ్లుగా నిలిపివేశారని ఆరోపించారు.100 పడకల ఆసుపత్రి 80 శాతం పనులు పూర్తయిన ఆసుపత్రిని ఎందుకు పూర్తి చేయలేదని మహేష్ కుమార్ గౌడ్‌ను ప్రశ్నించారు.
భీమ్‌గల్ ప్రజల సౌకర్యార్థం తాను తెచ్చిన బస్సు డిపోను ఈ ప్రభుత్వం మూసివేసిందని మండిపడ్డారు.
రైతులకు ఉపయోగపడే మార్కెట్ పనులను కూడా కాంగ్రెస్ అటకెక్కించిందన్నారు.
డబ్బులతో ఓట్లు కొనాలని చూస్తున్నారు
ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులు సంచులు పట్టుకొని వస్తున్నారని, ఒక్కో వార్డుకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ ఓట్లు కొనాలని చూస్తున్నారని విమర్శించారు. “డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ ఓటు మాత్రం కారు గుర్తుకే వేయండి” అని ఆయన పిలుపునిచ్చారు. భీమ్‌గల్‌ను దోచుకోవడానికి సిద్ధంగా ఉన్న బకాసురుల చేతుల్లో పెట్టవద్దని హెచ్చరించారు.
అసెంబ్లీ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దపు హామీలే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భీంగల్‌కు వచ్చి “ఇవి చేస్తాం… అవి చేస్తాం” అంటూ హామీల వర్షం కురిపిస్తున్నాడని అన్నారు. ఆయన కొత్తగా చెప్పింది ఏమి లేదన్నారు. కానీ గతంలో భీంగల్ ప్రజలకు కష్టకాలం వచ్చినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రి పనులు ఆగిపోయినప్పుడు ఎందుకు రాలేదు?
నేను తీసుకొచ్చిన రూ.11 కోట్ల అభివృద్ధి పనులను కావాలనే నిలిపివేసినప్పుడు ఎందుకు స్పందించలేదు?
భీంగల్ మార్కెట్ యార్డు నిర్మాణం పూర్తిగా పూర్తి కాకుండా నిలిచిపోయినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు?
పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ సునీల్ రెడ్డి తదితరులు అందరూ కలిసి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయనే కారణంతో భీంగల్‌పై దండయాత్ర చేస్తున్నారు.
గత రెండేళ్లుగా భీంగల్ ప్రజల కోసం ఒక్క పని కూడా చేయకుండా, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని “ఇవి చేస్తాం… అవి చేస్తాం” అంటూ ఉపన్యాసాలు ఇవ్వడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే తప్ప, నిజమైన అభివృద్ధి కాదు.
భీంగల్ ప్రజలు ఈ వాస్తవాలను గమనించి, ఎవరు నిజంగా అభివృద్ధి చేశారో ఎవరు మాటలకే పరిమితమయ్యారో తేల్చే సమయం వచ్చింది. భీమ్‌గల్ అంటే తనకు ఎంతో ప్రాణమని, ఒక తండ్రి తన బిడ్డను ఎలా చూసుకుంటాడో.. భీమ్‌గల్‌ను కూడా తాను అలాగే అభివృద్ధి చేసానని వేముల భావోద్వేగంగా చెప్పారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే, నిలిచిపోయిన పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ అభ్యర్థులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply