భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ…

భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ…

డ్రగ్స్, గంజాయి మాఫియా నిర్మూలనకు యువత పోరాడాలి : జి.రామన్న

కర్నూలు, ఆంధ్రప్రభ : అమరవీరుల స్ఫూర్తితో డ్రగ్స్, గంజాయి మాఫియాను రూపుమాపేందుకు యువత ముందుకు రావాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న పిలుపునిచ్చారు. కర్నూలు మండలం ఈ తాండ్రపాడు గ్రామంలో సోమవారం భగత్ సింగ్ విగ్రహాన్ని రూరల్ తహసీల్దార్ టి.వి. రమేష్ బాబు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న కలిసి ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ బాలపీర అధ్యక్షతన జరిగిన సభలో తహసీల్దార్ రమేష్ బాబు మాట్లాడుతూ దేశభక్తికి ప్రతిరూపం భగత్ సింగ్ అని పేర్కొన్నారు.

చిన్న వయసులోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి యువతకు ఆదర్శంగా నిలిచాడని అన్నారు. పార్లమెంటులో ఎవరికి అపాయం కలగకుండా బాంబు విసిరి బ్రిటిష్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన సంఘటనను గుర్తుచేశారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లను 23 ఏళ్ల వయసులో ఉరి తీసినా, వారి త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. వారి త్యాగఫలితమే నేటి స్వేచ్ఛ అని పేర్కొన్నారు.

అనంతరం జి.రామన్న మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల 95వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి మాఫియా నిర్మూలనకు ప్రతిజ్ఞ దినంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతను కాపాడాలంటే మత్తు పదార్థాల ప్రభావాన్ని పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, కానీ ప్రస్తుతం యువతలో కొందరు డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు బానిసలవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు.

రాజకీయ అండదండలతోనే ఈ మాఫియా విస్తరిస్తోందని, అన్ని రాజకీయ పార్టీలు గంజాయి డాన్‌లను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మాజీ డివైఎఫ్ఐ నాయకులు డి.గౌస్ దేశాయ్, జి.రామకృష్ణ మాట్లాడుతూ గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన యువజన నాయకుడు పెంచలయ్యను నెల్లూరులో హత్య చేయడం దురదృష్టకరమన్నారు. అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పాఠశాలల సమీపంలో కూడా చాక్లెట్, బిస్కెట్ రూపంలో మత్తు పదార్థాలు వ్యాప్తి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో పేదరికం, నిరుద్యోగం, అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు రాఘవేంద్ర, అబ్దుల్లా, సిఐటియు మండల కార్యదర్శి ఉసేనయ్య, న్యాయవాదులు సింగరాజు లక్ష్మన్న, మోహన్ కృష్ణ, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, నిర్వహణ కమిటీ సభ్యులు వెంకటస్వామి, హుస్సేన్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ యువకులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Leave a Reply