dammapeta | మందలపల్లి గురుకులంలో విద్యార్థి పరార్.

సమయస్ఫూర్తితో బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ఇంటెలిజన్స్ కానిస్టేబుల్ భార్య
దమ్మపేట, ఆంధ్రప్రభ విధి నిర్వహణలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారు కానీ ,తాము కూడా సమాజ రక్షణలో తక్కువ కాదని నిరూపించారు ఒక పోలీసు కానిస్టేబుల్ భార్య. దమ్మపేట మండల ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎన్.కృష్ణారావు భార్య లక్ష్మి చూపిన సమయస్ఫూర్తితో, హాస్టల్ నుంచి పారిపోయిన ఒక ఏడవ తరగతి విద్యార్థి సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. గురుకుల పాఠశాల యజమాన్యం నిద్రమత్తులో ఉన్నా, ఆమె మాత్రం అప్రమత్తంగా వ్యవహరించి విద్యార్థి తల్లిదండ్రులు చెంతకు చేర్చారు.
అసలేం జరిగిందంటే..
ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టిగూడెం గ్రామానికి చెందిన ఓ విద్యార్ది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. అయితే హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక, ఆదివారం మధ్యాహ్న సమయంలో ఎవరికీ చెప్పకుండా, కనీసం మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండానే బయటకు వచ్చేశాడు.మందలపల్లి నుంచి పల్లె వెలుగు బస్సులో సత్తుపల్లి చేరుకుని, అక్కడ నుంచి ఖమ్మం బస్సు ఎక్కాడు.అదే బస్సులో ప్రయాణిస్తున్న ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ కృష్ణారావు భార్య లక్ష్మి, ఒంటరిగా ఉన్న బాలుడిని గమనించారు. ఆ అబ్బాయి ముఖంలో భయం, ఆందోళనను గుర్తించి ఆత్మీయంగా మాట్లాడి వివరాలు ఆరా తీశారు. బాలుడు హాస్టల్ నుంచి పారిపోతున్నాడని గ్రహించిన ఆమె, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తన భర్త కృష్ణారావుకు ఫోన్ చేసి సమాచారం అందించారు.కానిస్టేబుల్ కృష్ణారావు వెంటనే తన ఉన్నతాధికారి, ఇంటెలిజెన్స్ ఆర్‌ఐఓ రామోజీ రమేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు గురుకుల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లును అప్రమత్తం చేశారు. అప్పటి వరకు బాలుడు లేడన్న సంగతి తెలియని స్కూల్ యాజమాన్యం వెంటనే తనిఖీలు చేపట్టగా బాలుడు లేడని నిర్ధారణ అయ్యింది.
సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు..
మరోవైపు కానిస్టేబుల్ భార్య లక్ష్మీ బాలుడి తండ్రి చంద్రశేఖర్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. బస్సు ఖమ్మం బస్టాండ్ చేరుకోగానే, అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసుల సహాయంతో బాలుడిని క్షేమంగా తండ్రికి అప్పగించారు. పోలీసులే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా అంతే బాధ్యతగా వ్యవహరిస్తారని లక్ష్మి నిరూపించారు. ఆమె చూపిన ఈ చొరవను ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు , స్థానిక ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. గురుకుల పాఠశాలలో భద్రతను పటిష్టం చేయాలని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
