నంద్యాల బ్యూరో, సెప్టెంబర్ 9 (ఆంధ్రప్రభ) : నంద్యాల (Nandyal) జిల్లా అవుకు మండలంలోని సుంకేసుల గ్రామంలో ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని ఎర్రబల్లి మహిధర్ (3) అనే బాలుడు మృతిచెందిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. సుంకేసుల (Sunkesula) గ్రామానికి చెందిన ఎర్రబెల్లి శ్రీనివాసులు, మీనాక్షిలకి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కోయిలకుంట్ల పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ప్రతిరోజూ విద్యార్థినీ, విద్యార్థులను ఎక్కించుకునేందుకు సుంకేసులు గ్రామానికి వస్తుండేది.
రోజులాగే విద్యార్థులందరూ బస్సు ఎక్కుతుండగా అక్కడే ఉన్న మహీధర్ (Mahidhar) అనే బాలుడిని బస్సు ఢీకొంది. ఈ ప్రమాద ఘటనలో మహీధర్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు, బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఘటనకు గల కారణాలను తెలుసుకొన్నారు. పోలీసులు (police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఫిట్నెస్ లేని బస్సులతో ఇబ్బందులు…
328 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో (Private school) విద్యార్థులను పల్లెటూరు నుంచి ఎక్కించుకోవడానికి బస్సులను ఉపయోగిస్తారు. ఈ బస్సులు ఫిట్నెస్ లేకపోవడంతో జిల్లాలో ఇప్పటికే బస్సుల కిందపడి ఐదు మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. ప్రతి సంవత్సరం పాఠశాలలు ప్రారంభానికి ముందు ఏప్రిల్, మే నెలలో పాఠశాలలకు సంబంధించిన బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ (Fitness Certificate) ఆర్టీవో కార్యాలయం నుంచి తెచ్చుకోవాలి. చాలా పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీవో అధికారులు ఫిట్నెస్ లేని బస్సులను స్వాధీనం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.