ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బొర్రా గాంధీ…
- 15 మంది సభ్యులు,
- ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రమాణస్వీకారం…
- బోర్డు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించిన ఈఓ శీనా నాయక్…
- శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు ఎమ్మెల్యేలు ప్రముఖులు…
- భారీగా హాజరైన కుటుంబ సభ్యులు స్నేహితులు
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం ఆర్భాటంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటిన తర్వాత నూతన పాలకమండలిని ఇటీవల ప్రకటించింది.
దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా బొర్రా రాధాకృష్ణ(గాంధీ)ని, మరో 16 మంది సభ్యులతో పాటు ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ అదే సారి జారీ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఇంద్రకీలాద్రి మహా మండపం ఏడవ అంతస్తు వద్ద పాలకమండలి సభ్యులతో ఈవో శీనా నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా గాంధీ తో పాటు మరో 15 మంది సభ్యులు ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు శనివారం ప్రమాణ స్వీకారం చేయగా విదేశాలలో ఉన్న మరో సభ్యురాలు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన పాలకమండలి చైర్మన్ తో పాటు సభ్యులకు మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన) చౌదరి, గద్దె రామ్మోహన్రావు, బోడె ప్రసాద్ లు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. వీరితోపాటు కూటమి పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు శ్రేణులు పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలివచ్చి ట్రస్ట్ బోర్డు సభ్యులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి….
వారాంతపు సెలవులకు తోడు, నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం కోసం తరలివచ్చిన వారితో ఇంద్రకీలాద్రి శనివారం కిక్కిరిసింది. నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం పాలకమండలి సభ్యుల కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు అభిమానులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి కి రావడం, దర్శనాల కోసం ఎగబడటంతో రూ 500 రూపాయలు విఐపి క్యూ లైన్లు కిక్కిరిస్తాయి.
ఉదయం నుండి భక్తుల రాకతో పాటు పాలకమండలి సభ్యుల కుటుంబ సభ్యులు రాక పెరిగిన నేపథ్యంలో అధికారులు ముందస్తుగా అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేశారు. ఉదయం 8:30 నుండి అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేయడంతో పాటు రూ 500 రూపాయల టికెట్లు జారీ కూడా నిలుపుదల చేశారు.
విఐపి లందరికీ బంగారు వాకిలి ద్వారా అమ్మవారి దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేశారు. అయితే వందల సంఖ్యలో ట్రస్ట్ బోర్డు సభ్యుల స్నేహితులు కుటుంబ సభ్యులు బంధువులు రావడంతో విఐపి క్యూలైన్లతో పాటు ప్రధాన గేట్ల వద్ద హడావిడి ఎక్కువగా కనిపించింది.
ప్రతి ఒక్కరూ అంతరాలయ దర్శనం కోసం పట్టు పట్టడంతో, అధికారులకు పెద్ద తలనొప్పి వచ్చింది. ఇదే సమయంలో అమ్మవారి దర్శనానికి పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు రావడం విఐపి క్యూ లైన్ లన్నీ కిక్కిరిసి ఉండడంతో అమ్మవారి దర్శనానంతరం బయటికి వచ్చే రహదారి గుండా ఎదురు గా వీరిని ఆశీర్వచన మండపం మీదుగా అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. పాలకమండలి ప్రమాణ స్వీకారం రోజునే వీఐపీల తాకిడి ఇంత ఎక్కువగా ఉంటే రానున్న రోజులలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది.
తొలిరోజే ఇంద్రకీలాద్రి పై ప్రోటోకాల్ వివాదం….
పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత నూతన చైర్మెన్ రాధాకృష్ణ (గాంధీ) తో సహా కొందరి సభ్యులు మీడియా సమావేశాన్ని మహా మండపం ఆరవ అంతస్తులు నిర్వహించారు. అదే సమయంలో మీడియా సమావేశ ప్రదేశానికి వచ్చిన ఈఓ శీనా నాయక్ ప్రెస్ మీట్ ఉందని నాకు ఎందుకు చెప్పలేదని సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరే ప్రెస్ మీట్ నిర్వహించుకోండి అంటూ ఇసురుగా కోపంగా యువసేన నాయక్ అక్కడ నుండి వెళ్లిపోయారు. ఈఓ లేకుండా ప్రెస్ మీట్ ప్రారంభించేందుకు సిద్ధమైన చైర్మన్, ఈఓ సిరియస్ గా వెళ్ళిపోయిన విషయాన్ని సిబ్బంది చైర్మన్ గాంధీకి చెప్పడంతో 10 నిమిషాలు పాటు ఈఓ కోసం ఎదురు చూసి కబురు పెట్టారు.
చైర్మన్ ఎదురు చూస్తున్న విషయాన్ని ఈఓ కు సిబ్బంది చెప్పడంతో ఆలస్యంగా ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. ప్రెస్ మీట్ కు తనకు ముందస్తు సమాచారం లేదని తాను ఎటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పనని ఈవో బదులు ఇవ్వడంతో విలేకరులందరూ అవాక్కయ్యారు.
ప్రెస్ మీట్ సమయంలో ఈఓ చైర్మన్ తో పాటు కూర్చున్న చైర్మన్ కుమారుడు కూర్చోవడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రమాణ స్వీకారం రోజునే పాలకమండలి సభ్యులకి దేవస్థానం అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్యం కోసం పరితపించడం ఒకరిపై ఒకరు అలగడం వంటి అంశాలు ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై చర్చనీయాంశంగా మారాయి.


