హైదరాబాద్, ఆంధ్రప్రభ :
భాగ్యనగరం (bhagyanagarm) ఆదివారం బోనమెత్తింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి (ujjaini mahankali )ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ (minister ponnam ) తొలి పూజలు (first prayer ) చేశారు. తెల్లవారజాము నాలుగు గంటలకు తన సతీమణితో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్ధరాత్రి దాటిన తర్వాత క్యూ లైన్‌లో నిలబడిన భక్తులు బోనాలు సమర్పించడం ప్రారంభించారు. అలాగే ఒడి బియ్యాన్ని సమర్పించారు. ఉజ్జయిని ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ ఆవరణలో సుమారు రెండు కిలోమీటర్ల వరకూ కోలాహలం నెలకొంది.

నగరం సుభిక్షంగా ఉండాలి
లష్కర్ బోనాల జాతరలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఉజ్జయిని ఆలయంలో బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్టాడుతూ.. హైదరాబాద్ నగరం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు చెప్పారు. అమ్మవారి కరుణకటాక్షంతో నగరం మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
లష్కర్ బోనాల జాతరలో ప్రముఖులు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పిఎల్ శ్రీనివాస్, సనత్‌నగర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి కోట నీలిమ తదితరులున్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
దేవదాయశాఖ, పోలీసు శాఖ సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాయి. ఆలయం లోపల ఇబ్బందులు తలెత్తకుండా దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, కమిషనర్ ఐ. వెంకటరావు సౌకర్యాలు కల్పించారు. ప్రధానంగా తాగునీటి సౌకర్యం కల్పించారు. పోలీసు బందోబస్తును నార్త్ జోన్ డీసీపీ రష్మిక పెర్మల్ చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకొని ఏర్పాట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు.