కశింకోట, జులై 23 (ఆంధ్రప్రభ) : అనకాపల్లి (Anakapalli) జిల్లా కసింకోట(Kasimkota) లో పసికందు మృతదేహం కలకలం రేపింది. స్థానిక పంచాయతీ కార్యాలయం (Panchayat Office) సమీపంలో ఉన్న మురుగు కాల్వలో పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానిక ఐసీడీఎస్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. అభం, శుభం తెలియని చిన్నారి మృతదేహాన్ని మురుగు కాలంలో చూసి స్థానికులు చలించిపోయారు.
పేగు బంధాన్ని సైతం లెక్కచేయకుండా మురుగు కాల్వలో పసికందును విసిరేసిన జాలిలేని కర్కోటక తల్లిని నిందించారు. ఇదేనా మాతృమూర్తి ప్రేమంటే అంటూ అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ కాలువలో పసికందు మృతదేహాన్ని ఎవరు పడేశారన్నఅంశంపై ఐసీడీఎస్, పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల పురుడు పోసుకున్న తల్లుల జాబితాను సేకరిస్తున్నారు.