శ్రీనగర్ .. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో పాకిస్థాన్ మరోసారి తన దుర్బుద్ధిని చాటుకుంది. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ), అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాత్రి పాకిస్థాన్ సైన్యం విచక్షణారహితంగా, అడ్డగోలుగా జరిపిన కాల్పులు, ఫిరంగి దాడుల్లో 10 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 30 మంది వరకు గాయపడ్డారని భారత సైన్యం వెల్లడించింది. పాక్ దుశ్చర్యకు తగిన రీతిలో బదులిచ్చినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
మృతుల్లో 12 ఏళ్ల బాలిక జోయా ఖాన్, 10 ఏళ్ల బాలుడు మొహద్ జైన్‌తో పాటు మొహద్ ఆదిల్, సలీమ్ హుస్సేన్, రూబీ కౌర్, మొహద్ అక్రమ్, అమ్రిక్ సింగ్, రంజిత్ సింగ్, మొహద్ రఫీ, మొహద్ ఇక్బాల్ ఉన్నట్లు సైన్యం గుర్తించింది. ఈ దాడుల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల అధికారులతో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమావేశమై పరిస్థితిని సమీక్షించనున్నారు.
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన శిక్షణా శిబిరాలపై ఈ తెల్లవారుజామున 1.44 గంటలకు భారత్ ఖచ్చితమైన దాడులు నిర్వహించిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ ఈ కాల్పులకు తెగబడింది. 1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్‌పై ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు సంయుక్తంగా నిర్వహించిన తొలి త్రివిధ దళాల ఆపరేషన్ ఇది. ఈ ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని పేరుపెట్టారు. ఈ దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమవ్వగా, మరో 60 మంది గాయపడ్డారని సమాచారం.