Blast in Pakistan | లాహోర్ విమానాశ్ర‌యం వ‌ద్ద భారీ పేలుడు

ఇస్లామాబాద్ – భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్న వేళ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది. వాల్టన్ రోడ్‌లోని సైనిక విమానాశ్రయానికి సమీపంలో పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వాల్టన్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పలు పేలుళ్లు సంభవించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఈ రహదారి లాహోర్ కంటోన్మెంట్‌కు దారితీస్తుంది. పేలుడు ఘటనను పాకిస్థాన్ పోలీసు అధికారులు ధ్రువీకరించారని, దీని కచ్చితమైన స్వభావం, ప్రదేశాన్ని నిర్ధారించే పనిలో ఉన్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

పేలుళ్ల ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని, ఆ ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో సైరన్ల మోత వినిపించడం ఆందోళనను మరింత పెంచింది. వాల్టన్ విమానాశ్రయం వద్ద ఒక డ్రోన్ కూడా కనిపించినట్లు సమాచారం. లాహోర్‌లోని అస్కరీ 5 సమీపంలో కూడా రెండు పెద్ద పేలుళ్లు వినిపించాయని, నేవల్ కాలేజీ నుంచి పొగలు వస్తున్నాయని కొన్ని ధ్రువీకరించని వార్తలు తెలిపాయి.

కాగా, అంతకుముందు గురువారం ఉదయం లాహోర్, సియాల్‌కోట్‌లలో పలు కీలక వాయుమార్గాలను వాణిజ్య విమానాల రాకపోకలకు పాకిస్థాన్ మధ్యాహ్నం వరకు మూసివేసింది. ఈ మేరకు కొత్తగా నోటీస్ టు ఎయిర్‌మెన్ (నోటామ్) జారీ చేసినట్లు తెలిసింది. భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలపై బుధవారం తెల్లవారుజామున దాడులు జరిపి ధ్వంసం చేసిన నేపథ్యంలో నేటి ఉద‌యం ఈ పేలుడు ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *