కాకినాడ :పార్సిల్ దింపుతుండగా పేలుడు
అయిదుగురికి గాయాలు
పార్శిల్ బ్యాగ్ లో టపాసులు ఉన్నట్లు గుర్తింపు
వత్తిడికి పేలిన లోపల ఉన్న టపాకాయాలు
కాకినాడ బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో ఘటన
కాకినాడ : కాకినాడ బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో ఇవాళ పేలుడు ఘటన సంభవించి ఐదుగురికి గాయాలయ్యాయి. ఈరోజు (సోమవారం) ఉదయం బాలాజీ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో అగ్ని్ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్ లోడ్‌ను పలువురు కూలీలు లారీ నుంచి కిందకు దించుతున్నారు. ఈ క్రమంలో ఓ కార్మికుడు పెద్ద పార్శిల్‌ను లారీ నుంచి తీసి భుజాన వేసుకుని కిందకు దించుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అయిదుగురు కూలీలు గాయపడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి పార్శిల్ వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అయితే పార్శిల్‌ను దించిన వెంటనే పేలుడు సంభవించడానికి కారణం ఏంటి అనేదానిపై ఆరా తీయగా… అందులో చిన్న పిల్లలు కాల్చే టపాసులు ఉన్నట్లు గుర్తించారు. చిన్న పిల్లలు గోడకేసి కొట్టగా పేలే టపాసులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిబంధనల ప్రకారం పేలుడు పదార్థాలు ఉన్న పార్శిల్‌ను అనుమతించడం నేరం. అయినప్పటికీ కూడా ఇలాంటి నిబంధనలు పట్టించుకోకుండా ట్రాన్స్‌పోర్టు కంపెనీలు ఏ విధంగా హైదరాబాద్ నుంచి ఇక్కడకు తరలించారు అనేదానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి ఈ పార్శిల్‌ను ఎవరు పంపించారు ఆ కంపెనీ ఏంటి అనే దానిపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. అయితే వేసవి నేపథ్యంలో ఇలాంటి పార్శిల్‌లు వేస్తే కచ్చితంగా ప్రమాదాలు సంభవిస్తాయని, ట్రాన్స్‌పోర్టు కంపెనీలు అజాగ్రత్తగా ప్రవర్తించడం ఏమాత్రం మంచి పద్దతి కాదని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.