- కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ చార్జ్‌షీట్ విడుదల
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 23 నెలలు పూర్తవుతున్న తరుణంలో, ఆ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని బీజేపీ ఘాటుగా విమర్శించింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న వాగ్దానాలు, ఆరు గ్యారెంటీల అమలు పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు “కాంగ్రెస్ వైఫల్యాలపై చార్జ్‌షీట్”ను శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు.
రాంచందర్ రావు మాట్లాడుతూ.. “2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ 60 పేజీల మేనిఫెస్టోలో 420 హామీలు, 13 ప్రధాన వాగ్దానాలు ఇచ్చింది. అదీకాక, 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఘనంగా ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు 100 రోజులు కాదు.. దాదాపు 1000 రోజులు గడిచినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయింది. పేదల పట్ల, రైతుల పట్ల, మహిళల పట్ల ఈ ప్రభుత్వ వైఖరి మోసపూరితమైనది. కాంగ్రెస్ చూపిన హస్తం ‘అభయ హస్తం’ కాదు — ‘భస్మాసుర హస్తం’!” అని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేకపోయిందని, రాష్ట్ర బీజేపీ ఈ వైఫల్యాలను చార్జ్‌షీట్ రూపంలో ప్రజల ముందుకు తీసుకువస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బిజెఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీ బసవ నరసయ్య, సీనియర్ నాయకులు ప్రకాశ్ రెడ్డి, సంగప్ప, దిలీప్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.


