- జూబ్లీహిల్స్ భవితవ్యం మార్చే ఉపఎన్నిక…
- మజ్లిస్ ముందు మోకరిల్లిన బీఆర్ఎస్, కాంగ్రెస్
- అభివృద్ధి కోసం ఓటు బీజేపీకి!
హైదరాబాద్ / బోరబండ, ఆంధ్రప్రభ: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలపై కీలక ప్రభావం చూపనుంది. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది.
కాగా, ఈ ప్రచారంలో భాగంగా బోరబండలో జరిగిన మహిళా మోర్చా సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రజల సమస్యలను పట్టించుకోని బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ (AIMIM) ముందు మోకరిల్లే పరిస్థితికి చేరాయి అని తీవ్రంగా విమర్శించారు.
“AIMIM ఓట్ల కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు అజారుద్దీన్‌ను మంత్రిగా చేశారు. ఈ రెండు పార్టీల నేతలు మజ్లిస్ నాయకుల ముందు వంగి వంగి సలాం కొడుతున్నారు. ఈ రెండు పార్టీలకు ప్రజలంటే చిత్తశుద్ధి లేదు. మజ్లిస్ ఆధిపత్యం నుంచి జూబ్లీహిల్స్‌ను కాపాడుకోవాలి” అని పిలుపునిచ్చారు.
మారని జూబ్లీహిల్స్ దుస్థితి
రెండు దశాబ్దాలుగా ఈ రెండు పార్టీల పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధి నిలిచిపోయిందని, ఎక్కడ చూసినా మురికినీరు, చెత్త, చీకటి వీధులు, పాడైన రోడ్లు మాత్రమే కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా… స్ట్రీట్‌లైట్లు వేయలేకపోయింది. యువతకు రూ.4,000, మహిళలకు రూ.2,500, స్కూటీలు, తులం బంగారం అన్నీ హామీలు ఇచ్చి మోసం చేసింది” అని విమర్శించారు.
‘బంగారు తెలంగాణ’ అని మోసం చేశారు
“తెలంగాణ బంగారం” అని చెప్పి కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నాడు. కేసీఆర్ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు వచ్చాయి.. కానీ తెలంగాణ యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో నడుస్తూ విద్యార్థులను ‘విద్యాభరోసా కార్డు’ పేరుతో మోసం చేస్తున్నాడు” అని అన్నారు.
మోదీతోనే మార్పు సాధ్యం..
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. “కరోనా సమయంలో 140 కోట్ల ప్రజలకు రక్షణగా నిలిచారు. దేశంలోని 83 కోట్ల మందికి ఉచిత బియ్యం, మహిళలకు రూ.20 లక్షల వరకు రుణాలు, ఉజ్వల పథకం ద్వారా వంటగ్యాస్ సౌకర్యం మోదీ ప్రభుత్వమే అందించింది” అని గుర్తు చేశారు.
“మోసం చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఈసారి తగిన బుద్ధి చెప్పాలి. జూబ్లీహిల్స్ ప్రజల కోసం, అభివృద్ధి కోసం, మహిళా శక్తి కోసం, యువత భవిష్యత్తు కోసం బీజేపీకి ఓటు వేయండి. మోదీతో ముందుకు సాగుదాం” అని ఆయన పిలుపునిచ్చారు.



