BJP | Khammam | తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం

BJP | Khammam | ఖమ్మం, ఆంధ్రప్రభ : తన ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రత్యర్థులు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని, అందులో భాగంగానే తనపై అక్రమ కేసులు బనాయించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు(Nellore Koteswara Rao) అన్నారు. పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక, కొంతమంది దుష్టశక్తులు ఏకమై తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వివాదాస్పద కంపెనీలో తనకు భాగస్వామ్యం ఉందని వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ కంపెనీలో తనకు ఎటువంటి వాటా (Share) లేదని స్పష్టం చేశారు. ఆ కంపెనీ వ్యక్తులు తనకు తెలుసు అన్న కారణంతో తనను ఈ కేసులోకి లాగడం అత్యంత దురదృష్టకరమని ఆయన స్పష్టం చేశారు. చట్టంపై , పోలీసు వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, విచారణలో భాగంగా పోలీసులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తామని, పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఆయన తెలిపారు. దురుద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
చట్టపరంగా పోరాటం చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడమే కాకుండా, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై పరువు నష్టం (Defamation Suit) దావా వేస్తామని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఎవరిపై పడితే వారిపై ఆరోపణలు చేయడం సరికాదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని(Be responsible) ఆయన సూచించారు. సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, మీడియా ఇంచార్జి డా.నెల్లూరి బెనర్జీ, ఉపాధ్యక్షులువీరవల్లి రాజేష్ గుప్తా, సుదర్శన్ మిశ్రా, రజినీ రెడ్డి, మనీ, సోషల్ మీడియా ఇన్చార్జి శ్రీకృష్ణ, సీనియర్ నాయకులు సుబ్బారావు,రుద్ర గాని మాధవ్, మేకల నాగేందర్, తడుపునూరి రవీందర్ పాల్గొన్నారు
